జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: త్రిముఖ పోరుతో రసవత్తరంగా మారిన రాజకీయ రంగం”

YSR Praja News : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రసవత్తర పోరు – త్రిముఖ సమరం దిశగా రాష్ట్ర రాజకీయాలు!

 

హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాల్లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయడంతో ప్రధాన రాజకీయ పక్షాలు ముమ్మరంగా సన్నాహాలు ప్రారంభించాయి. ఈ సారి త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సిట్టింగ్‌ పార్టీ బీఆర్ఎస్‌, అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్ష బీజేపీ – ఈ మూడు పక్షాలు బరిలో నిలవనున్నాయి.

 

కాంగ్రెస్‌లో చురుగుదనం – బీసీ అభ్యర్థిపై దృష్టి

కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక గెలిచి ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ, జూబ్లీహిల్స్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్లో బలహీనతను అధిగమించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నేతృత్వంలో సీనియర్‌ నేతలు, మంత్రులు, కార్పొరేషన్‌ చైర్మన్లు రంగంలోకి దిగారు. బీసీ వర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టాలన్న ఆలోచనలో పార్టీ ఉంది. నవీన్‌ యాదవ్‌, బొంతు రామ్మోహన్‌, అంజన్‌ యాదవ్‌ల పేర్లు చర్చనీయాంశంగా ఉండగా, కార్పొరేటర్‌ సీఎన్‌ రెడ్డి పేరు కూడా ఏఐసీసీ జాబితాలో ఉందని సమాచారం.

 

బీఆర్ఎస్‌లో ముందస్తు సిద్ధత – మాగంటి సునీత ఫిక్స్‌

సిట్టింగ్‌ పార్టీగా ఉన్న బీఆర్ఎస్‌ ఇప్పటికే మాగంటి గోపీనాథ్‌ భార్య సునీతను అభ్యర్థిగా ఖరారు చేసింది. పార్టీ అధినేత కేసీఆర్‌ నేతృత్వంలో వ్యూహరచన జరుగుతోంది. ఎర్రవెల్లి నివాసంలో కీలక సమావేశం జరగనుంది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నెల రోజులుగా కేడర్‌ను సన్నద్ధం చేస్తున్నారు. ఆరు డివిజన్లకు ఇన్‌చార్జిలను నియమించి, ప్రచార యంత్రాంగాన్ని చురుకుగా మలుస్తున్నారు.

 

బీజేపీ ఆశలు – “కాషాయ జెండా” లక్ష్యం

కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ లోక్‌సభ పరిధిలో ఉండటంతో ఈ ఉప ఎన్నిక బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. హిందూత్వ ఎజెండా, కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్‌ వ్యతిరేకతను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని బీజేపీ బరిలోకి దిగనుంది. లంకెల దీపక్‌ రెడ్డి, అట్లూరి రామకృష్ణ, జయసుధ, ఆకుల విజయ, వీరపనేని పద్మ, బండారు విజయలక్ష్మీ వంటి పేర్లు టికెట్‌ కోసం పోటీలో ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు ఆధ్వర్యంలో ఎన్నికల కమిటీ త్వరలో అభ్యర్థిని ప్రకటించనుంది.

 

ఎంఐఎం గేమ్‌ప్లాన్‌పై అనిశ్చితి

మజ్లిస్‌ ఈసారి ఏ వైపు నిలుస్తుందనే అంశం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి కారణమైందని భావించే ఎంఐఎం, ఈ సారి తన వ్యూహంపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఎడమపక్షాలు (సీపీఐ, సీపీఎం) కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

మొత్తానికి, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మక యుద్ధంగా మారింది. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్లో ఎవరి ప్రభావం కొనసాగుతుందో ఈ పోరే

సూచనగా మారనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *