​బ్యూటిఫికేషన్ కాదు.. అదొక లూటిఫికేషన్! మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.

YSR Praja News Telugu : హైదరాబాద్,: రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం నాగోల్ పరిధిలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించిన ఆయన, బాధితులతో మాట్లాడి వారి ఆవేదనను తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్నది మూసీ ‘బ్యూటిఫికేషన్’ (సుందరీకరణ) కాదని, అదొక ‘లూటిఫికేషన్’ (దోపిడీ) అని ఘాటుగా విమర్శించారు.

పేదల ఇళ్ల కోసం బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతాం:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల ఇళ్లను కూల్చేందుకు పంపిస్తున్న బుల్డోజర్లకు తాము అడ్డంగా నిలబడతామని కేటీఆర్ స్పష్టం చేశారు. “పేదల ఇళ్లను కాపాడుకుంటాం. మూసీ ప్రక్షాళన పేరుతో సాగుతున్న ఈ భారీ దోపిడీని అడ్డుకుంటాం,” అని ఆయన హామీ ఇచ్చారు. గతంలో కట్టిన ఇళ్లకు కేవలం రంగులు మార్చడం తప్ప, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.

రాజకీయ సన్యాసం సవాల్:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ ఒక బహిరంగ సవాల్ విసిరారు. “మీ హయాంలో రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఇల్లు కట్టి చూపించినా, నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటాను,” అని ప్రకటించారు. మూసీ ప్రక్షాళన చేతకాకపోతే తమకు అప్పగించాలని, ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా నదిని శుభ్రం చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

బడ్జెట్ అంచనాలపై అనుమానాలు:

మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు వ్యయం అంచనాలను భారీగా పెంచడంపై కేటీఆర్ మండిపడ్డారు. గతంలో కేవలం 16 వేల కోట్లతో పూర్తవుతుందని అంచనా వేసిన ప్రాజెక్టును, రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్షా 50 వేల కోట్లకు పెంచిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు కావస్తున్నా, ఇప్పటికీ మూసీ సుందరీకరణపై స్పష్టమైన వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

కూల్చివేతలపై ద్వంద్వ నీతి:

అభివృద్ధి పేరిట పేదల ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని, కూల్చకుండానే అభివృద్ధి చేయవచ్చని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించారని కేటీఆర్ గుర్తుచేశారు. కూల్చివేతల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. “కోస్గిలో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. దుర్గం చెరువులో ఆయన సోదరుడి ఇల్లు ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కేవీపీ రామచంద్రరావు, పట్నం మహేందర్ రెడ్డి వంటి ప్రముఖుల ఇళ్లు బఫర్ జోన్లలో ఉన్నాయి. వారిపై లేని చర్యలు పేదలపై ఎందుకు?” అని ప్రశ్నించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక్క ఇల్లు కూల్చకుండా కేవలం ఆరు కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ పనులు చేపట్టామని, అలాగే 30 కోట్ల రూపాయలతో ఉప్పల్‌లో శిల్పారామాన్ని నిర్మించామని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన అంశంపై రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *