​AP Police కి పేర్ని నాని Open Challenge.. ఆ CC Footage ఉంటే బయటపెట్టండి!

YSR Praja News Telugu : ఏపీ పోలీసుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా” అన్న చందంగా పోలీసుల వ్యవహారశైలి ఉందంటూ మండిపడ్డారు. కృష్ణా జిల్లా పామర్రులో జుజ్జవరపు సుప్రియ అనే మహిళపై పోలీసులు అక్రమంగా కేసు బనాయించి జైలుకు పంపారని ఆయన ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పామర్రు పోలీసుల తీరు, ఎస్పీ కార్యాలయ ప్రకటనలు, మరియు స్థానికంగా జరుగుతున్న అవినీతిపై సంచలన ఆరోపణలు చేశారు.

సంతకం లేని ‘అశరీరవాణి’ ప్రకటనలా ఎస్పీ ఆఫీస్ ప్రెస్ నోట్!

సుప్రియను జైలులో పరామర్శించిన అనంతరం, బాధితురాలు చెప్పిన విషయాల ఆధారంగా పామర్రు సీఐ సుధాకర్, ఎస్ఐ భాస్కర్, హోంగార్డు కోటేశ్వరమ్మ ఆమెపై ఎలా దాడి చేశారో తాను గతంలోనే వివరించినట్లు పేర్ని నాని గుర్తు చేశారు. దీనిపై న్యాయం చేయాలని ఎస్పీని కోరితే.. తెల్లవారుజామున 3 గంటలకు ఎస్పీ కార్యాలయం నుంచి సంతకం లేని ఓ ‘అశరీరవాణి’ లాంటి ప్రకటన విడుదల చేశారని ఎద్దేవా చేశారు. పోలీసులు దాడి చేయలేదని, సుప్రియ శరీరంపై గాయాలు లేవని డాక్టర్లు చెప్పారని అందులో పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. తాను పోలీసులందరినీ నిందించడం లేదని, కేవలం దుర్మార్గంగా వ్యవహరిస్తున్న అధికారుల తీరునే ప్రశ్నిస్తున్నానని స్పష్టం చేశారు.

దమ్ముంటే సీసీ ఫుటేజ్ బయటపెట్టండి.. నా సవాల్!

సుప్రియ పోలీసులపై దాడి చేసిందని చెబుతున్న అధికారులు.. దానికి సంబంధించిన ఆధారాలు ఎందుకు చూపించడం లేదని నాని ప్రశ్నించారు. “ఈ నెల 21వ తేదీన సుప్రియ, ఆమె తల్లిదండ్రులు పామర్రు స్టేషన్‌కు వెళ్లారు. నిజంగానే సుప్రియ పోలీసులపై దాడి చేసినట్లు నిరూపించండి. ఆ రోజు స్టేషన్‌లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను మీడియాకు విడుదల చేయండి. మీరు ఆధారాలు బయటపెడితే.. నేను మాట్లాడిన ప్రతి మాట వెనక్కి తీసుకుంటా. పోలీసు సిబ్బందికి బహిరంగంగా క్షమాపణలు చెబుతా. ఉదయం 11:30 గంటల లోపు ఆధారాలు బయటపెట్టాలి” అని పోలీసులకు నాని సవాల్ విసిరారు. అలాగే ఆమె సోదరుడు తేజ దొంగతనం చేసినట్లు చెబుతున్న సీసీ కెమెరా ఆధారాలను కూడా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

పామర్రులో పేకాట దందా.. పోలీసుల వసూళ్లు!

పామర్రు నియోజకవర్గం పేకాటకు నిలయంగా మారిందని పేర్ని నాని ఆరోపించారు. ఆశ్రమం ఏరియాలో పేకాట శిబిరంపై దాడి చేసిన పోలీసులు.. నిర్వాహకుల వద్ద రూ. లక్షా 60 వేలు వసూలు చేశారని ఆరోపించారు. ఏలూరు నుంచి వచ్చిన నిర్వాహకులతో ఓ మూడు నక్షత్రాల అధికారి (సీఐ స్థాయి) డీల్ కుదుర్చుకున్నారని విమర్శించారు. రైల్వే అనిల్ దమ్ముగా రాజకీయం చేసే వ్యక్తి అని, ఆయన డబ్బులకు కక్కుర్తి పడే రకం కాదని స్పష్టం చేశారు.

108 సిబ్బంది లేఖపై అనుమానాలు:

తాను కులమతాలను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని, ఆ విషయం ఎస్పీ తెలుసుకోవాలని నాని హితవు పలికారు. పోలీసులకు వ్యతిరేకంగా సామాన్యులు సాక్ష్యం చెప్పే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. సుప్రియను ఆసుపత్రికి తీసుకెళ్లలేదని 108 సిబ్బంది లిఖితపూర్వకంగా రాసివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఎక్కడైనా 108 సిబ్బంది ఇలా రాసివ్వడం చూశామా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ నాయకులు లేఖలు ఇస్తేనే పోలీసులు కేసులు కట్టే దారుణమైన పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *