YSR Praja News Telugu : తాండూర్, జూన్ 21: తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ కె. జయశంకర్ వర్ధంతి సందర్భంగా తాండూర్ పట్టణంలో ఆయన విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పూలమాలలు వేసి జయశంకర్ సార్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, తెలంగాణ జనసమితి తాండూర్ ఇంచార్జి సాంబూర్ సోమశేఖర్ మాట్లాడుతూ, జయశంకర్ సార్ చూపిన మార్గంలో సాగిన ఉద్యమ ఫలితంగానే భౌగోళిక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని అన్నారు. అయితే తెలంగాణ ఉద్యమం యొక్క అసలు లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలు ఇంకా పూర్తిస్థాయిలో నెరవేరలేదని పేర్కొన్నారు.
రాష్ట్ర ఏర్పాటు కేవలం ఒక దశ మాత్రమేనని, తెలంగాణ ప్రజలందరికీ సమాన అభివృద్ధి, సామాజిక న్యాయం, ఉపాధి అవకాశాలు, విద్యా సదుపాయాలు అందే వరకు ఉద్యమ స్ఫూర్తితో పోరాటం కొనసాగాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో జయశంకర్ సార్ చెప్పిన “రాష్ట్ర సాధనతో పోరాటం ముగియదు.. ప్రజల ఆకాంక్షలు నెరవేరే వరకు అది కొనసాగుతూనే ఉంటుంది” అనే మాటలు నేటికీ ఎంతో ప్రాసంగికంగా ఉన్నాయని గుర్తు చేశారు.
ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల పట్ల ముఖ్యంగా యువతలో పెరుగుతున్న అసంతృప్తిని ప్రస్తావిస్తూ, ఉపాధి కల్పన, నాణ్యమైన విద్య, సామాజిక న్యాయం వంటి అంశాలకు ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. యువత ఆశయాలను, ఆకాంక్షలను విస్మరిస్తే భవిష్యత్తులో తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదురయ్యే అవకాశముందని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన ద్వారానే జయశంకర్ సార్‌కు నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని పేర్కొన్న వారు, రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ సార్ జయంతి, వర్ధంతులను అధికారిక కార్యక్రమాలుగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ ఉద్యమ చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చి, భవిష్యత్ తరాలకు ఉద్యమ స్ఫూర్తిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి నాయకులు, తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రతినిధులు, ఆర్టీసీ, సీఐటీయూ, పీడీఎస్‌యూ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయశంకర్ సార్‌కు ఘనంగా నివాళులర్పించారు.




