పెద్దపల్లి లో ఏసీబీ దాడులు: లంచం తీసుకుంటూ మున్సిపల్ ఏఈ అరెస్ట్ – ఇంట్లో రూ.32 లక్షల నగదు స్వాధీనం

YSR Praja News Telugu : పెద్దపల్లి, జూలై 14:
పెద్దపల్లి జిల్లాలో అవినీతి పై యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు భారీ దాడులు నిర్వహించారు. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) సతీష్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం స్థానికంగా సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే… మున్సిపాలిటీలో ఎంబీ (మెజర్‌మెంట్ బుక్) రికార్డు నమోదు కోసం ఒక కాంట్రాక్టర్ వద్ద నుంచి ఏఈ సతీష్ రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. అంత పెద్ద మొత్తం అడగడంతో కంగుతిన్న కాంట్రాక్టర్ వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏసీబీ అధికారుల సూచనల మేరకు ముందస్తు ప్రణాళికతో ఇవాళ (మంగళవారం) కాంట్రాక్టర్ సతీష్‌కు లంచం ఇస్తుండగా, అధికారులు అక్కడే దాడి చేసి అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనతో పెద్దపల్లిలో ఒక్కసారిగా కలకలం రేగింది.
ఇంట్లో భారీగా నగదు స్వాధీనం
అరెస్ట్ అనంతరం ఏసీబీ అధికారులు సతీష్ నివాసంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో మంచం కింద దాచిన భారీ మొత్తంలో నగదు కట్టలు బయటపడినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు రూ.32 లక్షల వరకు నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.
విచారణ కొనసాగుతోంది
ఏఈ సతీష్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతని వద్ద మరిన్ని అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.
అవినీతి పై కఠిన చర్యలు
ఈ ఘటనతో ప్రభుత్వ విభాగాల్లో అవినీతి వ్యవహారాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఈ సంఘటన పెద్దపల్లి జిల్లాలో సంచలనం సృష్టించగా, అవినీతి పై ప్రజల్లో చర్చ మరింత ఉధృతమైంది.