Jagan Warns Naidu & Police! ఓటమి భయం.. అందుకే స్థానిక ఎన్నికల్లో హింస, కుట్రలు: వైఎస్ జగన్ ధ్వజం
వైఎస్సార్సీపీ శ్రేణులకు హృదయపూర్వక ప్రణామాలు, హెచ్చరించిన మాజీ సీఎం
ఆంధ్రప్రదేశ్:
ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగితే గెలుస్తామన్న నమ్మకం, ధైర్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకుని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వమే హింసను ప్రేరేపిస్తోందని ఆయన ఆరోపించారు.
”నారాసుర రక్త చరిత్ర” రాస్తున్నారు!
చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం “నారాసుర రక్త చరిత్ర” రాస్తున్నారని, ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలనే ఏకైక లక్ష్యంతో అక్రమాలకు, కుట్రలకు తెగబడుతున్నారని వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వమే స్వయంగా హింసాత్మక ఘటనలకు పాల్పడటం దారుణమని పేర్కొన్నారు.
అధికారులకు, పచ్చ నాయకులకు కఠిన హెచ్చరిక
ఇదే సమయంలో అధికార బలం చూసుకుని అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు, పచ్చ నాయకులను జగన్ గట్టిగా హెచ్చరించారు.
”అన్యాయం చేసిన ప్రతి అధికారికి, అన్యాయం చేస్తున్న ప్రతి వెన్నుపోటు పార్టీ నాయకుడికి చెబుతున్నా… ఇప్పుడు మీ టైమ్ నడుస్తుండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మా టైమ్ కూడా వస్తుంది! మా టైమ్ వచ్చినప్పుడు మీరు ఈరోజు చేసిన ప్రతి అక్రమం మీకు తిరిగి చుట్టుకోవడం ఖాయం” అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
కార్యకర్తల త్యాగాలకు “హ్యాట్సాఫ్”
కూటమి ప్రభుత్వం అరాచకాలను ఎదిరించి నిలబడిన పార్టీ శ్రేణులను ఆయన ఆకాశానికెత్తేశారు. ఇన్ని కష్టాలను ఓర్చి ధైర్యంగా నిలబడిన ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్తకు, ప్రజాస్వామ్యవాదికి హృదయపూర్వక శాల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు.
చంద్రబాబు తుపాకీ తూటాలకు వెరవకుండా, పోలీసుల లాఠీలకు భయపడకుండా, టీడీపీ గూండాల దాడులకు బెదరకుండా వెన్నుచూపక పోరాడుతున్న ప్రతి వైఎస్సార్సీపీ పోరాటయోధుడికి ‘హ్యాట్సాఫ్’ చెబుతున్నానని జగన్ కొనియాడారు. ఎంతటి అణచివేత ఎదురైనా ధర్మం, ప్రజాస్వామ్యం తరఫున వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

