YSR Praja News Telugu : హైదరాబాద్: నగరంలోని సీతారాంబాగ్ చారిత్రాత్మక ఆలయం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్వీ నాయకుడు నవీన్ ఆధ్వర్యంలో, గోషామహాల్ నియోజకవర్గానికి చెందిన జి. శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు నేతలు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
రావణాసురుడి తరహాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఏర్పాటు చేసి దహనం చేయగా, అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను శ్రీరాముడి తరహాలో చిత్రీకరించి నినాదాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
కాంగ్రెస్ – బీఆర్ఎస్ వర్గాల మధ్య తోపులాట
ఈ నిరసన గురించి తెలుసుకున్న కాంగ్రెస్ ఫిషరీస్ విభాగం చైర్మన్ మెట్టు సాయికుమార్ తన అనుచరులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బీఆర్ఎస్వీ నాయకుల తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వారిపైకి దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
పోలీసుల జోక్యం – కేసు నమోదు
సమాచారం అందుకున్న మంగళ్‌హాట్ పోలీసులు వెంటనే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి మరింత దిగజారకుండా ఇరువర్గాలను చెదరగొట్టారు.
ఈ ఘటనకు సంబంధించి బీఆర్ఎస్వీ నాయకుడు నవీన్‌తో పాటు మరో పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిరసనకారులను అరెస్టు చేసినట్లు మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

