Friday, 27 November 2026ప్రజల గొంతుక • నిజం మీ ముందుకి
YSR Praja News
YSR PRAJA NEWS
ప్రజల గొంతుక.. నిజం మీ ముందుకి
వికారాబాద్ న్యూస్ / Vikarabad News

అక్రమ ఇసుక తవ్వకాలపై యాలాల తహసీల్దార్ కొరడా.. సాయంత్రంలోపు యంత్రాలు తీయకపోతే సీజ్!

November 27, 2026 • ysrprajanews

YSR Praja News Telugu : యాలాల, నవంబర్ 27 (వికారాబాద్ జిల్లా): యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామంలోని శివసాగర్ ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై యాలాల తహసీల్దార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులో ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్న ఇసుక దందాను తక్షణమే నిలిపివేయాలని కోరుతూ శుక్రవారం వివిధ ప్రజాసంఘాల నాయకులు తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

యంత్రాలను సీజ్ చేస్తాం: తహసీల్దార్

ప్రజాసంఘాల వినతిపై తహసీల్దార్ తక్షణమే స్పందిస్తూ.. తాను ఇప్పటికే శివసాగర్ ప్రాజెక్టును స్వయంగా సందర్శించి పరిస్థితిని పరిశీలించానని తెలిపారు. సాయంత్రం లోపు ప్రాజెక్టు ప్రాంతంలో ఉన్న జేసీబీ, హిటాచీ యంత్రాలను నిర్వాహకులు స్వచ్ఛందంగా తొలగించకపోతే, వాటిని సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం: ప్రజాసంఘాలు

అంతకుముందు ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ, శివసాగర్ ప్రాజెక్టులో కొందరు అక్రమార్కులు ఎటువంటి అనుమతులు లేకుండా భారీ జేసీబీ, హిటాచీ యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారని ఆరోపించారు. పదుల సంఖ్యలో టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రేయింబవళ్లు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల వల్ల ఇప్పటికే సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో ఇసుకను విచ్చలవిడిగా తరలించడం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయి, సమీప రైతుల బోర్లు ఎండిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు.

కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరిక

అధికారులు ఇచ్చిన హామీ మేరకు సాయంత్రం లోపు అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న వాహనాలను సీజ్ చేయకపోయినా, ఇసుక రవాణాను అడ్డుకోకపోయినా ఊరుకునేది లేదని నాయకులు తేల్చి చెప్పారు. ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి వికారాబాద్ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

పాల్గొన్న నాయకులు:

ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహబ్, సీఐటీయూ (CITU) జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కే. చంద్రయ్య, తెలంగాణ వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు వడ్డే సత్యనారాయణ, ఎమ్మార్పీఎస్ (MRPS) జిల్లా నాయకులు నర్సింలు, పూలే అంబేద్కర్ సంఘం నాయకులు రఘుపతి, యాదగిరి తదితర వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments are closed.

అన్ని న్యూస్ క్యాటగిరీలు