YSR Praja News Telugu: జహీరాబాద్ (నవంబర్ 16): జాతీయ జర్నలిస్టుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమ్ ఆర్మీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయ మిత్రులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జహీరాబాద్ పట్టణంలోని భీమ్ ఆర్మీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సిద్ధూ రావణ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని, జర్నలిస్టులకు శాలువా కప్పి, జ్ఞాపిక మరియు ప్రశంసా పత్రాలను అందజేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా సన్మానం అందుకున్న పలువురు పాత్రికేయ మిత్రులు మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ప్రజలకు, పాలకవర్గానికి మధ్య వారధిగా నిలుస్తూ, ప్రజా సమస్యలపై తమ కలంతో అలుపెరగని పోరాటం చేసే జర్నలిస్టులను గుర్తించి గౌరవించడం చాలా అరుదని అన్నారు. తమ సేవలను గుర్తించి ఇంతటి ఘన సన్మానం చేసిన భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సిద్ధూ రావణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అనంతరం భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధూ రావణ్ మాట్లాడుతూ.. సమాజంలో అట్టడుగున ఉన్న అన్ని వర్గాలను కలుపుకొని సామాజిక చైతన్యంతో అహర్నిశలు పోరాడేందుకు భీమ్ ఆర్మీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. సమాజంలో మంచి చేసే ప్రతి ఒక్కరి పక్షాన భీమ్ ఆర్మీ నిలబడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా బలహీన వర్గాల గొంతుకై వారి తరఫున నిత్యం పోరాడే అక్షర సైనికులను గుర్తించి సన్మానించడం తన బాధ్యతగా భావిస్తున్నానని ఆయన అన్నారు.
జహీరాబాద్ పట్టణంతో పాటు పరిసర ప్రాంత మండలాలకు చెందిన పలువురు విలేకరులు ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ టౌన్ ప్రెసిడెంట్ అలీ, అల్లిపూర్ విలేజ్ ప్రెసిడెంట్ బలరాం అలీ, నాయకులు ధనుంజయ్, నరసింహులు, బాలరాజు, రాచన్న, మహేష్, అరుణ్, రఫీ, కయ్యుం, విజయ్, రాములు, శంకర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

