YSR Praja News Telugu : హైదరాబాద్: సుప్రీంకోర్టులో దానం నాగేందర్‌కు ఎదురుదెబ్బ తగలడం, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పును అత్యున్నత నాయస్థానం సమర్థించడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు స్పష్టమైంది. ఈ పరిణామంతో అక్కడ ఉపఎన్నికకు మార్గం సుగమమవ్వగా, తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి మైనార్టీలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే ఖైరతాబాద్ ఉపఎన్నిక ద్వారా ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన హెచ్చరించారు.
మైనార్టీ డిక్లరేషన్ అమలులో ఘోర విఫలం
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ‘మైనార్టీ డిక్లరేషన్’ ప్రకటించి అధికారంలోకి వచ్చిందని, కానీ పీఠం ఎక్కిన తర్వాత ఆ డిక్లరేషన్‌లో పేర్కొన్న ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయలేదని అబ్దుల్ వాహబ్ మండిపడ్డారు. ఓట్ల కోసం ముస్లిం మైనార్టీలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక తీవ్రంగా మోసం చేశారని విమర్శించారు.
వక్ఫ్ భూముల ఆక్రమణ, జామియా నిజామియా భూముల విక్రయం
వక్ఫ్ భూముల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, వక్ఫ్ బోర్డు ఆస్తుల డిజిటలైజేషన్ చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం… ప్రస్తుతం అందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చారిత్రక సంస్థ అయిన జామియా నిజామియాకు సంబంధించిన వక్ఫ్ భూములను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమ్ముకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. వక్ఫ్ భూములకు రక్షణ లేకుండా చేయడం ముస్లింల నమ్మకాలను వంచించడమేనని అన్నారు.
హక్కుల కాలరాణివేత – ఉపఎన్నికలో తగిన శాస్తి
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాస్తూ, వారిపై జరుగుతున్న వరుస దాడులను అరికట్టడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి మైనార్టీలపై జరుగుతున్న ప్రత్యక్ష దాడిలా ఉందన్నారు. మోసపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖైరతాబాద్ ఉపఎన్నిక వేదికగా మైనార్టీలు మరియు ప్రజల శక్తి ఏంటో చూపిస్తామని, ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తామని అబ్దుల్ వాహబ్ స్పష్టం చేశారు.




