YSR Praja News Telugu : తాండూరు: వికారాబాద్ జిల్లా యాలాల మండలం విశ్వనాథ్‌పూర్ గ్రామంలో కుటుంబ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామానికి చెందిన కొప్పుల వెంకటమ్మ, ప్రశాంత్‌లపై కొప్పుల వెంకటప్ప, అనిత, గోపాల్‌లు ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులు ప్రస్తుతం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను ప్రజాసంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు.
ఆదివారం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి చేరుకున్న ప్రజాసంఘాల నాయకులు బాధితులు వెంకటమ్మ, ప్రశాంత్‌లను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం. వెంకటయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ.. విశ్వనాథ్‌పూర్ గ్రామంలో దాయాదుల మధ్య చోటుచేసుకున్న వివాదం హింసాత్మక ఘటనకు దారితీయడం ఆందోళనకరమన్నారు.
వెంకటమ్మ, ప్రశాంత్‌లపై ఇనుప రాడ్లతో దాడి చేయడం అమానుషమని, ఈ ఘటనలో బాధితులకు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొప్పుల వెంకటప్ప, అనిత, గోపాల్‌లపై పోలీసులు తక్షణమే కేసు నమోదు చేసి, విచారణ జరిపి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
తాండూరు డివిజన్‌లో ఇలాంటి ఘటనలపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు, వారి కుటుంబాలకు తగిన రక్షణ కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను విజ్ఞప్తి చేశారు.
శాంతియుతంగా ఉండే గ్రామాల్లో ఇలాంటి హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు బస్సు చంద్రయ్య, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

