
YSR Praja News Telugu : తాడేపల్లి: రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అధికార పక్షం వైఫల్యాలను ఎండగడుతూనే, పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా శుక్రవారం (ఏప్రిల్ 3వ తేదీ) వైఎస్సార్సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ముఖ్య నేతలతో కీలక టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ భేటీలో తిరుమల పవిత్రత, రాష్ట్ర రాజధాని అంశాలతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో సజ్జల పలు కీలక నిర్దేశాలు చేశారు.
తిరుమల పవిత్రత మంటగలుస్తోంది.. బీఆర్ నాయుడిని తొలగించాల్సిందే!
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి తీరుపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రోజురోజుకీ తిరుమల పవిత్రత దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలను కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో రేపు (ఏప్రిల్ 4వ తేదీ) రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు, భక్తులకు సజ్జల పిలుపునిచ్చారు.
రాజధానిపై మా వైఖరి స్పష్టం.. ‘ప్లాన్-బి’తోనే రియల్ క్యాపిటల్
రాష్ట్ర రాజధాని అంశంపై తమ పార్టీకి మొదటి నుంచి ఒక స్పష్టమైన వైఖరి ఉందని సజ్జల ఉద్ఘాటించారు. “అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని శాశ్వతంగా దోచుకోవాలనే కుట్రపూరిత ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి నిర్మాణం పేరుతో చేస్తున్న అప్పులు భవిష్యత్తులో రాష్ట్రంపై మోయలేని భారంగా మారనున్నాయి” అని ఆయన విమర్శించారు.
దీనికి ప్రత్యామ్నాయంగా వైఎస్సార్సీపీ ఒక స్పష్టమైన ‘ప్లాన్-బి’ని సూచిస్తోందని తెలిపారు. మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు ప్రాంతాలను అనుసంధానిస్తూ ఒక గ్రోత్ కారిడార్‌ను ఏర్పాటు చేసి, దానిని మెగా సిటీగా అభివృద్ధి చేయడమే ఆ ప్లాన్ అని వివరించారు. ఈ విధానం ద్వారా చాలా తక్కువ ఖర్చుతో కూడిన ‘రియల్ క్యాపిటల్’ (నిజమైన రాజధాని) సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఉన్న ఈ అభివృద్ధి ఆలోచనలను గ్రామగ్రామానికి తీసుకెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలని నాయకులకు సూచించారు.
18 లక్షల సభ్యత్వమే లక్ష్యం.. ఓటర్ల జాబితాలపై డేగకన్ను
రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ సంస్థాగత నిర్మాణంపై సజ్జల కీలక సూచనలు చేశారు. ఓటర్ల జాబితాల రూపకల్పనలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులను హెచ్చరించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO), బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) సమన్వయంతో పనిచేస్తూ, కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను ఎంతో జాగ్రత్తగా పర్యవేక్షించాలన్నారు.
పార్టీ కమిటీల నిర్మాణం దాదాపు తుది దశకు చేరుకుందని సజ్జల వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షల క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికే 13 లక్షల మంది సభ్యుల డేటా పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకుందని హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే వారందరికీ అధికారికంగా ఐడీ కార్డులను పంపిణీ చేస్తామని ప్రకటించారు. గ్రామస్థాయిలో పార్టీ భావజాలాన్ని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడానికి సోషల్ మీడియా ద్వారా క్యాంపెయినింగ్‌ను మరింత ఉధృతం చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.




