YSR Praja News Telugu: హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్‌రావు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. దశాబ్దాల పోరాటానికి, ఎందరో అమరవీరుల త్యాగాలకు దక్కిన అసలైన నివాళి ఈ రోజు అని ఆయన అభివర్ణించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఒక ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.
అవమానాల అధ్యాయానికి ముగింపు
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన చారిత్రక ఘట్టమని హరీశ్‌రావు పేర్కొన్నారు. “ఇది త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు.. ఉమ్మడి పాలనలో మనం ఎదుర్కొన్న అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు,” అని ఆయన ఉద్వేగంగా వెల్లడించారు.
కేసీఆర్ నాయకత్వం.. సబ్బండ వర్గాల పోరాటం
తెలంగాణ రాష్ట్ర సాధన ఏ ఒక్కరితోనో సాధ్యం కాలేదని, ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అలుపెరగని నాయకత్వం, సబ్బండ వర్గాల సమష్టి పోరాటం కలిసే తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు ఇలా ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారని గుర్తుచేశారు.
పదేళ్ల ప్రగతి – దేశానికే ఆదర్శం
అనేక ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని గత పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ దార్శనికతతో వ్యవహరించి, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని చెప్పారు. “సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపాం. సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం వంటి కీలక రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించాం,” అని హరీశ్‌రావు వివరించారు.
అస్తిత్వ పరిరక్షణకు కంకణబద్ధులవుదాం
తెలంగాణ సాధన కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరుల ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వారు కలలుగన్న బంగారు తెలంగాణ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయాలన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని ఆకాంక్షిస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.




