
YSR Praja News Telugu : హైదరాబాద్: పశ్చిమాసియా (Middle East)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, ఇరాన్‌పై జరుగుతున్న దాడుల నేపథ్యంలో హైదరాబాద్ నగర ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అక్కడ రాజుకుంటున్న యుద్ధ వాతావరణం ఇక్కడి వారి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. జీవనోపాధి కోసం గల్ఫ్, ఇరాన్ తదితర దేశాలకు వెళ్లిన తమ బంధువులు, సన్నిహితులు ఎలా ఉన్నారో అని హైదరాబాదీలు తీవ్రంగా కలత చెందుతున్నారు. ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా వారి యోగక్షేమాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
రంజాన్ ప్రయాణాలకు బ్రేక్.. నిలిచిన విమానాలు
ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం నడుస్తుండటంతో గల్ఫ్ దేశాల నుంచి హైదరాబాదీలు పెద్ద ఎత్తున స్వదేశానికి వస్తుంటారు. కానీ యుద్ధ భయాల కారణంగా వీరి ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హైదరాబాద్ నుంచి నడిచే అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఎమిరేట్స్ తదితర గల్ఫ్ దేశాల సంస్థలవే అధికం కావడం గమనార్హం. విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ ఇరుక్కుపోయారు.
దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు, ఎన్నారైలు
విమాన సర్వీసులు నిలిచిపోవడంతో పలువురు ప్రముఖులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బర్మింగ్‌హామ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రయాణిస్తున్న విమానం రద్దు కావడంతో ఆమె దుబాయ్‌లో ఆగిపోవాల్సి వచ్చింది.
మరో విషాదకర ఘటనలో.. నగరంలోని టీఎన్ రెడ్డి నగర్‌కు చెందిన ఓ వృద్ధుడు మృతి చెందగా, అమెరికాలో స్థిరపడిన ఆయన పిల్లలు తండ్రిని కడసారి చూసేందుకు బయలుదేరారు. కానీ కనెక్టింగ్ ఫ్లైట్స్ రద్దు కావడంతో వారు కూడా దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు.
హైదరాబాద్ – ఇరాన్: శతాబ్దాల విడదీయరాని బంధం
హైదరాబాద్‌కు ఇరాన్‌తో శతాబ్దాల అనుబంధం ఉంది. కుతుబ్ షాహీల కాలం నుంచి ఇరానియన్లు నగరానికి వచ్చి స్థిరపడ్డారు. వ్యాపారంతో పాటు నిర్మాణ రంగంలోనూ వారి ముద్ర ఉంది.
సంస్కృతి, కట్టడాలు: చార్మినార్, గోల్కొండ తదితర చారిత్రక కట్టడాలలో పర్షియన్ నిర్మాణ శైలి స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ ఉర్దూలో పర్షియన్ (ఇరాన్) పదాలు మమేకమైపోయాయి.
ఆహారపు అలవాట్లు: ఇరానీ చాయ్, బిర్యానీ, హలీమ్ వంటి వంటకాలు హైదరాబాదీల దైనందిన జీవితంలో భాగమయ్యాయి. నగరంలో ఎన్నో ప్రసిద్ధ ఇరానీ రెస్టారెంట్లు ఇప్పటికీ ఆ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయి.
దౌత్య సంబంధాలు: భారతదేశంలో ఢిల్లీ తర్వాత ఇరాన్ కాన్సులేట్ (Consulate) కేవలం హైదరాబాద్‌లో మాత్రమే ఉండటం ఈ రెండు నగరాల మధ్య ఉన్న సంబంధానికి అద్దం పడుతోంది.
ఆందోళనలో విదేశీ విద్యార్థులు
నగరంలోని ఉస్మానియా (OU), సెంట్రల్ యూనివర్సిటీ (HCU) తదితర ప్రముఖ విద్యాసంస్థల్లో వందలాది మంది ఇరాన్ యువత చదువుకుంటున్నారు. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్, ఫార్మసీ కోర్సులు అభ్యసిస్తున్న వీరంతా.. ఇప్పుడు స్వదేశంలో తమ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటో అని తీవ్ర బెంగ పెట్టుకున్నారు.




