వికారాబాద్‌లో సీఐటీయూ భారీ నిరసన: అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి – ఫిబ్రవరి 12 సమ్మెకు పిలుపు

YSR Praja News Telugu : కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఐక్య పోరాటాలు తప్పనిసరని సీఐటీయూ (CITU) నాయకులు స్పష్టం చేశారు. అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్స్‌కు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
రిటైర్మెంట్ అయ్యి రెండేళ్లు గడుస్తున్నా కూడా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్‌కు రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పటివరకు చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని నాయకులు విమర్శించారు. ప్రతి అంగన్వాడీ టీచర్‌కు రెండు లక్షలు, హెల్పర్‌కు లక్ష రూపాయలు వెంటనే చెల్లించాలని, అలాగే రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న జీతాలు మరియు పింఛన్ సౌకర్యాన్ని వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెకు సంబంధించి డిపిఓ కార్యాలయం, డీఈఓ కార్యాలయం, ఐసీడీఎస్ పీడీ కార్యాలయాల్లో సమ్మె నోటీసులు అందజేశారు.
సీఐటీయూ వికారాబాద్ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన “శ్రమశక్తి నీతి–2025” పేరుతో ఉన్న కొత్త కార్మిక విధానం పూర్తిగా కార్మిక వ్యతిరేకమని ఆరోపించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, కార్పొరేట్లకు అనుకూలంగా లేబర్ కోడ్స్‌ను అమలు చేస్తున్నారని విమర్శించారు.
కొత్త విధానాన్ని తీసుకొచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహించి కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరపాల్సిందని, కానీ అలా చేయకుండా అప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. పార్లమెంట్‌లో సరైన చర్చ లేకుండా చట్టాలు ఆమోదించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ఇప్పటివరకు అమలులో ఉన్న ఎనిమిది గంటల పని దిన విధానాన్ని మార్చి 12 గంటల పనిదినాలను ప్రవేశపెట్టడం వల్ల కార్మికుల జీవన నాణ్యత దెబ్బతింటోందన్నారు. మూడు షిఫ్టుల విధానం స్థానంలో డే షిఫ్ట్ – నైట్ షిఫ్ట్ విధానం రావడం వల్ల కుటుంబ జీవితం ప్రభావితమవుతోందని తెలిపారు. కాంట్రాక్ట్ వ్యవస్థ విస్తరిస్తూ వలస కార్మికుల సంఖ్య పెరుగుతోందని, కనీస వేతనం, సమాన పనికి సమాన వేతనం వంటి హక్కులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని జిల్లాలోని కార్మిక వర్గాన్ని కే. శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బుస చంద్రయ్య, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా కార్యదర్శి నరసమ్మ, ఐసీడీఎస్ పరిగి ప్రాజెక్టు అధ్యక్షురాలు స్వరూపా, కార్యదర్శి మంజుల, అలాగే రిటైర్మెంట్ అయిన అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ నాగమ్మ, వెంకటమ్మ, నాగమణి, అంబాబాయి, చిన్నమ్మ, లలిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *