
YSR Praja News : హైదరాబాద్: సాధారణంగా సినిమాల్లోనే చూసే సన్నివేశం నిజంగా నగరంలో చోటుచేసుకుంది. పండగ వాతావరణంలో కుటుంబ సభ్యులందరూ ప్రశాంతంగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తుండగా, ఒక్కసారిగా భారీ శబ్దంతో టీవీ పేలిపోయింది. అదే సమయంలో ఇంట్లోని ఏసీ కూడా పేలిపోవడంతో అందరూ షాక్కు గురయ్యారు.
ఈ ఘటన హైదరాబాద్ సుచిత్ర ప్రాంతంలోని వసంల్ విహార్ కాలనీలో జరిగింది. ఇంతలో పక్కింటి నుంచి మరో భారీ శబ్ధం రావడంతో పరిస్థితి మరింత భయానకంగా మారింది. అక్కడ కూడా టీవీలు, ఏసీలు పేలిపోయాయి. వరుసగా ఇలాంటి పేలుళ్లు జరగడంతో నివాసితులు గందరగోళానికి లోనయ్యారు. వెంటనే హై వోల్టేజ్ కారణమని అనుమానించి, ఇంట్లో మిగతా ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేశారు.
ఈ ఘటనపై కాలనీవాసులు వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినా, ఎటువంటి స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అసలు కారణం వెలుగులోకి వచ్చింది. టీవీలు, ఏసీలు పేలిపోవడానికి హై వోల్టేజ్ కారణం కాకుండా, విద్యుత్ స్తంభాలకు ఉన్న వైర్లు ఎర్త్ అవ్వడమే కారణమని అధికారులు నిర్ధారించారు.
👉 ప్రజలు కోరుతున్నది: ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా విద్యుత్ శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని, స్తంభాల వద్ద సురక్షిత వైర్ల వ్యవస్థను ఏర్పాటు చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.
