
YSR Praja News: హైదరాబాద్ నగరంలోని అమీర్పేట్ ప్రాంతంలో గురువారం జరిగిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ సాయి అనే యువకుడు తనను తాను నిప్పంటించుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే… తెలంగాణలో బీసీలకు న్యాయం చేయడంలో ప్రధాన రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని సాయి ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసి తన వేదన తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన కార్యాలయానికి వెళ్లాడు. అయితే, మల్లన్న ఆ సమయంలో ఆఫీసులో లేకపోవడంతో సిబ్బంది రేపు రావాలని సూచించారని సమాచారం.
ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన సాయి, సమీపంలోని Q న్యూస్ కార్యాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని మంటలు పెట్టుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి, అక్కడివారే అతడిని సమీపంలోని వైద్యశాలకు తరలించారు.
వైద్యులు తెలిపిన సమాచారం ప్రకారం సాయి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలిసింది. ఘటన విషయం తెలుసుకున్న తీన్మార్ మల్లన్న, గాంధీ ఆస్పత్రికి చేరుకుని బాధిత యువకుడిని పరామర్శించేందుకు సిద్ధమైనట్టు తెలిసింది.
బీసీ కోటా అమలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ జరిగిన ఈ ఆత్మహత్యాయత్నం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా
మారింది.




