హైదరాబాద్ గాలిలో ప్రమాద ఘంటికలు..! డిసెంబర్లో రికార్డు స్థాయి కాలుష్యం

YSR Praja News Telugu :

హైదరాబాద్: నగరంలో శ్వాస తీసుకోవడం కూడా పరీక్షలాంటిదైపోతోంది. మొత్తం సంవత్సరం గడుస్తున్నా.. రాజధానిలో ఒక్కరోజైనా నిజమైన “శుభ్రమైన గాలి” లభించలేదని తాజా వాతావరణ నివేదికలు ఆందోళన రేపుతున్నాయి. జనవరి నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే.. హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఒక్కసారిగా కూడా “గుడ్” కేటగిరీని తాకలేకపోయింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రమాణాల ప్రకారం AQI 50 లోపే ఆరోగ్యానికి అనుకూలం. అయితే ఈ సంవత్సరం నమోదైన 337 రోజులలో —

203 రోజులు కేవలం “సంతృప్తికర స్థాయి”

110 రోజులు “పూర్” స్థితి

23 రోజులు “అన్‌హెల్దీ” స్థాయిలో గాలి నాణ్యత ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

నాలుగేళ్లలో ఇదే అత్యంత ప్రమాదకర పరిస్థితి

2022 నుంచి ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో గాలి నాణ్యతను పరిశీలిస్తే ఈసారి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డిసెంబర్‌లో AQI సగటు 185 గా నమోదై.. గత రికార్డులను మించినట్లు వెల్లడైంది. కాలుష్యం విషయంలో హైదరాబాద్ కూడా ఢిల్లీ దారిలో నడుస్తోందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకర పరిస్థితి

బుధవారం నమోదైన AQI వివరాలు ఇలా—

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ : 253

ఆమీనపూర్ : 201

అదేవిధంగా సోమాజిగూడ, బంజారాహిల్స్, సనత్నగర్, బొల్లారం, రామచంద్రాపురం, పాశమైలారం వంటి ప్రాంతాల్లో కూడా AQI 170-189 మధ్యగానే నమోదు అయ్యింది.

పెట్టుబడులు, అభివృద్ధితో పాటు నగరంపై కాలుష్య మబ్బులు కమ్ముకుంటుండగా.. పరిస్థితిని సరిచేయకపోతే రాబోయే రోజులు మరింత సంక్లిష్టమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *