
YSR Praja News : హైదరాబాద్: ఇండిగో విమాన సేవల్లో కొనసాగుతున్న అంతరాయాల నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసిన వెంటనే తెలంగాణ ఆర్టీసీ ముందడుగు వేసింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరు, చెన్నై రూట్లకు స్లీపర్ బస్సులను ప్రత్యేకంగా నడిపేందుకు ఏర్పాట్లు చేసింది.
ఎయిర్ ట్రావెల్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా ఉన్న ఈ బస్సులు సాయంత్రం 4.30 గంటలకు శంషాబాద్ నుంచి బయలుదేరనున్నాయి. అలాగే రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం దిశగా అదనపు బస్సుల సేవలను కూడా అందిస్తోంది.
ఇక రైల్వే విభాగం కూడా పరిస్థితిని సమీక్షించి, ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో సికింద్రాబాద్–చెన్నై, చర్లపల్లి–కోల్కతా, హైదరాబాద్–ముంబై రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపడం ప్రారంభించింది. అదనంగా, దేశవ్యాప్తంగా 37 రైళ్లకు 116 కోచులను జతచేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. కొంతమంది రైళ్లు ఇప్పటికే అదనపు బోగీలతో నడుస్తున్నాయి.
ఒకవైపు రద్దు, మరోవైపు టికెట్ విక్రయాలు కొనసాగుతుండడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేణిగుంట విమానాశ్రయంలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్లను రద్దు చేస్తుండటంపై ప్రయాణికుల్లో ఆగ్రహం పెరుగుతోంది. కొందరు ప్రయాణికులు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇండిగో సంక్షోభం ఎప్పుడు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకుంటుందో చూడాలి. ఈలోగా రోడ్డు, రైలు మార్గాలు ప్రయాణికులకు తాత్కాలిక భరోసాగా మారుతున్నాయి.




