
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “శ్రమశక్తి నీతి–2025” పేరుతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో దంతాలు లేని లేబర్ కోడ్స్‌ను తీసుకువచ్చిందని తీవ్రంగా విమర్శించారు. కొత్త కార్మిక విధానాన్ని తీసుకురావాలంటే ముందుగా కేంద్ర కార్మిక సంఘాలతో చర్చించి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహించాల్సిందని, కానీ అలా చేయకుండా అప్రజాస్వామికంగా చట్టాలను తీసుకువచ్చారని అన్నారు.
పార్లమెంట్లో సరైన చర్చ లేకుండానే కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే చట్టాలు మార్చి, కార్మిక వర్గం సాధించిన హక్కులను కాలరాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల వినోదం అనే చారిత్రక నినాదాన్ని తుంగలో తొక్కి, 12 గంటల పని విధానాన్ని అమలు చేయడం ద్వారా కార్మికులను బానిస సమాజం వైపు నెడుతున్నారని ఆరోపించారు.
మూడు షిఫ్టుల విధానం స్థానంలో డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్లతో కుటుంబ జీవితం దెబ్బతింటోందని, పిల్లలు నిద్రలేవకముందే తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. కాంట్రాక్ట్ విధానం, వలస కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తూ కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం వంటి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెలో పెద్ద సంఖ్యలో పాల్గొని కార్మిక శక్తిని చాటాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.
ఈ సభలో సిఐటీయూ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, వికారాబాద్ జిల్లాలోని కార్మికులు తమ హక్కుల కోసం సంఘటితంగా ముందుకు రావాలని కోరారు. గ్రామీణ, పట్టణ కార్మికుల సమస్యలు ఒకటేనని, అందుకే వ్యవసాయ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ ఉద్యోగులు అందరూ కలిసి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు యు. బుగ్గప్ప, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎం. వెంకటయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్. మైపాల్, CITU జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, ఉపాధ్యక్షులు బుస్స చంద్రయ్య, KVPS జిల్లా కార్యదర్శి మల్కయ్య, సీసీఐ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి శరన్నప్ప, అంగన్వాడీ యూనియన్ తాండూర్ ప్రాజెక్టు అధ్యక్షురాలు బాలమణి, కార్యదర్శి బేబీ, అంగన్వాడీ టీచర్లు రామంజమ్మ, శశికళ, విజయలక్ష్మి, సరస్వతి, సవిత, అన్నపూర్ణ, తాండూర్ మున్సిపల్ కార్మికుల యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, CITU తాండూర్ మండల నాయకులు జైపాల్, గ్రామపంచాయతీ కార్మికులు నరసింహులు, వెంకటప్ప, శాంతమ్మ, కిష్టప్ప, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.




