
YSR Praja News Telugu : సమ్మక్క–సారక్క జాతరకు వెళ్తున్న సమయంలో చోటు చేసుకున్న ఒక ఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది. తనను అడ్డుకున్న ఒక ముస్లిం పోలీస్ అధికారిని ఉద్దేశించి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.
ధర్నా సమయంలో సదరు పోలీస్ అధికారిని పదేపదే “ఆ తురుకోడు” అంటూ సంబోధించడాన్ని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి (TSMHPS) తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు ఒక వర్గాన్ని కించపరిచేలా ఉండటమే కాకుండా, సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని సమితి పేర్కొంది.
బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలా?
ఈ అంశంపై టీఎస్‌ఎంహెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వహాబ్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. ప్రజా ప్రతినిధిగా, బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్న వ్యక్తి ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం అత్యంత సిగ్గుచేటని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
“కౌశిక్ రెడ్డి తన నోరు అదుపులో పెట్టుకోవాలి.
శాంతిభద్రతలను కాపాడే పోలీస్ అధికారులకు మతం, కులం అంటగట్టడం ఆయన అహంకారానికి నిదర్శనం.
ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో చిచ్చు పెట్టేలా ఉంటాయి.”
అని అబ్దుల్ వహాబ్ స్పష్టం చేశారు.
పార్టీ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా వ్యవహారం
ఈ ఘటనతో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సమితి అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు టీఎస్‌ఎంహెచ్‌పీఎస్ విన్నపం చేసింది.
మైనార్టీల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ప్రవర్తించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణ, సామాజిక బాధ్యతను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అధిష్టానం తక్షణ నిర్ణయం తీసుకోవాలని కోరింది.
చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
ఈ విషయంలో పార్టీ నాయకత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని టీఎస్‌ఎంహెచ్‌పీఎస్ హెచ్చరించింది. మైనార్టీల గౌరవం, పోలీస్ వ్యవస్థ గౌరవం రెండింటినీ కాపాడాల్సిన అవసరం ఉందని, ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదని స్పష్టం చేసింది.
మైనార్టీలపై విద్వేషాన్ని పెంచే రాజకీయ వ్యాఖ్యలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, రాజకీయ పార్టీలపై ఉందని సమితి పేర్కొంది.



