కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12 సమ్మె – కార్మిక సంఘాల సంయుక్త ఆందోళన

YSR Praja News Telugu : ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లాలో సిఐటియు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేశారు.

ఈ సందర్భంగా సిఐటియు వికారాబాద్ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని కోరారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల కార్మిక వర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోందని అన్నారు. జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు కలిసి 2026 ఫిబ్రవరి 12న ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల అమలుకు 2025 నవంబర్ 21న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ సవరణ చట్టం 2025ను ఉపసంహరించుకోవాలని, పేదలకు ఉపాధి హామీ ఇస్తున్న ఎంజీఎన్ఆర్ఈజీఏ చట్టాన్ని కొనసాగించాలని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు.

కార్మిక వర్గ హక్కులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఈ సమ్మె నిర్వహిస్తున్నామని, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, వాటిలో పెట్టుబడుల ఉపసంహరణను ఆపాలని డిమాండ్ చేశారు.

పార్లమెంటులో మెజారిటీ బలంతో కార్పొరేట్ అనుకూల చట్టాలు తీసుకొస్తూ కార్మిక వర్గాన్ని దోపిడీ చేయాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఫిబ్రవరి 12న జరిగే సమ్మెకు జిల్లా వ్యాప్తంగా కార్మికులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నరసమ్మ, సువర్ణ, విజయలక్ష్మి, సరస్వతి, బాలమణి, జ్యోతి, గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ మండల అధ్యక్షుడు అంబరప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *