పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలని మందకృష్ణ మాదిగ డిమాండ్

YSR Praja News Telugu : హైదరాబాద్: మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.

 

ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కళాశాల ముందు నిర్వహించిన మీట్లో మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ, “బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్, మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌ను ఉద్దేశించి ‘దున్నపోతు’ అనే పదం వాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం” అన్నారు.

 

ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యల వల్ల దళితులు, బలహీన వర్గాల మధ్య దూరం పెరుగుతుందని పేర్కొన్నారు. జరిగిన తప్పును సరిదిద్దుకునే విధంగా వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన కూడా తప్పు జరిగిందని అంగీకరించారని తెలిపారు. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

 

అదేవిధంగా, మైనారిటీ వర్గాలకు చెందిన శాఖలో అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి కాగా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం ఎందుకు చేశారని ప్రశ్నించారు. అలాగే కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట్ స్వామి ఎందుకు మౌనం వహించారని కూడా మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు.

 

దళితుల పట్ల వివేక్ వెంకట్ స్వామి నిర్లక్ష్య ధోరణి చూపుతున్నారని, నిజంగా ఆయనలో దళిత స్ఫూర్తి ఉంటే వెంటనే పొన్నం వ్యాఖ్యలను ఖండించాల్సిందని అన్నారు. కాక జయంతి వేడుకలకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్‌ను ఆహ్వానించకపోవడంపై కూడా ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

 

బీసీలకు ఇస్తున్న 42 శాతం రిజర్వేషన్లను మాదిగ జాతి స్వాగతిస్తుందని, ఎంఆర్పీఎస్ మొదటి నుండి బీసీలకు 50 శాతం వాటా రావాలని కోరుతోందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఐక్యత అవసరమని, అగ్రకుల పేదలకు ఇచ్చినట్లే బీసీల రిజర్వేషన్లను అందరూ స్వాగతించాలని పిలుపునిచ్చారు.

 

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై జరిగిన దాడిని ఖండించిన మందకృష్ణ మాదిగ, “గవాయ్ దళితుడు కావడం వలనే కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేక దాడికి తెగబడ్డాయి. ఆయన స్థానంలో ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు ఉంటే ఈ దాడి జరిగేది కాదు” అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *