
YSR Praja News : కామారెడ్డి: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొదటి నుంచీ దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని మాజీ మంత్రి టి. హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, గాంధారి మండలాల్లో ఆదివారం పర్యటించిన ఆయన, మంజీరా ప్రవాహంతో మునిగిన పంటలను పరిశీలించారు. అనంతరం గాంధారి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొని ప్రసంగించారు.
2014లో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకేసారి ఏర్పడ్డప్పటి పరిస్థితులను గుర్తు చేశారు. ఆ సమయంలో వడ్లు, గోధుమలకు క్వింటాకు రూ.1,400 మద్దతు ధర ఉన్నదని, ఇప్పుడు వడ్ల ధర రూ.2,369 కాగా గోధుమల ధర రూ.2,585కు చేరిందని వివరించారు. ఉత్తర భారత రాష్ట్రాల్లో గోధుమలు పండిస్తారు కాబట్టి, వాటికి ఎక్కువ ధర ఇవ్వడం, కానీ దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణలో పండించే వడ్లకు తక్కువ ధర నిర్ణయించడం కేంద్రం వివక్షకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల కామారెడ్డి జిల్లాలో వచ్చిన వరదలతో రైతులు తీవ్రంగా నష్టపోయినా, రాష్ట్ర ప్రభుత్వం సహాయం అందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వయంగా వెళ్లి పరిస్థితి పరిశీలించిన సీఎం పదిహేను రోజుల్లో సమీక్ష చేస్తానని చెప్పి నెలరోజులు గడిచినా స్పందించలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయారని, తిరిగి కేసీఆర్ రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని హరీశ్ రావు అన్నారు.




