
YSR Praja News Telugu : వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల మహా ధర్నా.. రూ.18,000 ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్
వికారాబాద్, మార్చి 17: ఆశా వర్కర్ల దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నెలకు రూ. 18,000/- ల ఫిక్స్‌డ్ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు భారీ ధర్నా చేపట్టారు. సీఐటీయూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మార్చి 16, 17 తేదీలలో తలపెట్టిన రెండు రోజుల ‘వంటవార్పు’ మరియు నిరసన కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి (DMHO) నాయకులు వినతిపత్రం అందజేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, ఆశా యూనియన్ జిల్లా కార్యదర్శి కే. మంగమ్మ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పి. రామకృష్ణ, కోశాధికారి బుస్స చంద్రయ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ప్రభుత్వ హామీలు ఏవంటూ నాయకుల నిలదీత:
తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాలుగా పేద ప్రజలకు విశేషమైన ఆరోగ్య సేవలు అందిస్తున్నారని నాయకులు గుర్తుచేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఈ మహిళా కార్మికులకు కనీస చట్టబద్ధమైన సౌకర్యాలు గానీ, గ్యారెంటీ వేతనం గానీ లేకపోవడం శోచనీయమన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఆశా వర్కర్ల వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఆ హామీలు అమలు కాలేదని వారు మండిపడ్డారు. రూ. 50 లక్షల ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి కేవలం వాగ్దానాలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ప్రతినెలా ఇవ్వాల్సిన పారితోషికాలు కూడా సకాలంలో రాకపోవడంతో ఆశా వర్కర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. NHM (జాతీయ ఆరోగ్య మిషన్) కు సరిపడా నిధులు పెంచి తమ సమస్యలు పరిష్కరించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆశా వర్కర్ల ప్రధాన డిమాండ్లు ఇవే:
ఫిక్స్‌డ్ వేతనం: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18,000/- ల ఫిక్స్‌డ్ వేతనం నిర్ణయించాలి.
బకాయిల చెల్లింపు: జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలను వెంటనే చెల్లించాలి. 2021 జూలై నుండి డిసెంబర్ వరకు ఉన్న 6 నెలల పీఆర్సీ (PRC) ఎరియర్స్ చెల్లించాలి.
కేంద్ర ప్రభుత్వ పెంపు అమలు: ఆశా వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ. 1,500/- పారితోషికాన్ని తక్షణమే అమలు చేయాలి.
పెండింగ్ డబ్బులు: 2022 నుండి 2025 వరకు నాలుగు సంవత్సరాల లెప్రసీ సర్వే డబ్బులు, పల్స్ పోలియో, ఎలక్షన్ డ్యూటీ మరియు ఎగ్జామ్ డ్యూటీల పెండింగ్ డబ్బులను వెంటనే విడుదల చేయాలి.
సంక్షేమం & భద్రత: గతంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 50 లక్షల ఇన్సూరెన్స్, రూ. 50 వేల మట్టి ఖర్చులకు జీవోలు జారీ చేయాలి. పీఎఫ్ (PF), ఈఎస్ఐ (ESI) సౌకర్యంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి.
పదోన్నతులు: ఏఎన్ఎం (ANM), జీఎన్ఎం (GNM) శిక్షణ పూర్తి చేసిన ఆశా వర్కర్లకు ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి.
సెలవులు: ప్రతి ఆదివారం మరియు పండుగ రోజుల్లో సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి.
టార్గెట్ల రద్దు: ఏఎన్సీ (ANC), పీఎన్సీ (PNC) తదితర టార్గెట్లను రద్దు చేస్తూ సర్క్యులర్ ఇవ్వాలి.
రిటైర్మెంట్ బెనిఫిట్స్: రిటైర్మెంట్ బెనిఫిట్ కింద రూ. 5 లక్షలు చెల్లించాలి. ఇస్తున్న పారితోషికాల్లో సగం మొత్తాన్ని పెన్షన్‌గా నిర్ణయించాలి.
ఈ భారీ నిరసన కార్యక్రమంలో ఆశా వర్కర్లు ఎస్. మాధవి, కె. పద్మ, సునీత, యాదమ్మ, కౌసల్య, రాధ, శశికళ, పద్మ, అరుణ, యశోద, మంగమ్మ, పద్మావతి, రమాదేవి, వి. రేఖ, యాదమ్మ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




