
YSR Praja News Telugu : ఉద్యోగ కల్పన విషయంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లు సురేంద్ర రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. “మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుని నిరుద్యోగులకు అండగా నిలిస్తే… ప్రస్తుత ప్రభుత్వం కేవలం మాటలతో, మోసకారి హామీలతో యువతను వంచిస్తోంది” అని ఆయన మండిపడ్డారు.
ప్రస్తుత ప్రభుత్వానివి మోసాలే.. పట్టించుకోని దుస్థితి
రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని సురేంద్ర రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయానికి నోటిఫికేషన్లు రాక, వయోపరిమితి దాటిపోవడం వల్ల ఏటా దాదాపు 75 వేల మంది యువతీ యువకులు ప్రభుత్వ ఉద్యోగ అర్హత కోల్పోతున్నారని, అయినా ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకునే స్థితిలో లేదని విమర్శించారు. నిరుద్యోగులకు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశలు కల్పించిన వారు.. ఇప్పుడు కేవలం 10 వేల ప్రభుత్వ ఉద్యోగాలతో ‘జాబ్ క్యాలెండర్’ అంటూ కొత్త రాగం పాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
నాడు వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల జాతర
2019 నుంచి 2024 మధ్య కాలంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన నియామకాలను ఈ సందర్భంగా మల్లు సురేంద్ర రెడ్డి గుర్తు చేశారు. ఐదేళ్ల కాలంలో ఏకంగా 6,31,310 ఉద్యోగాలు కల్పించి జగన్ సరికొత్త చరిత్ర సృష్టించారని కొనియాడారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో జరిగిన నియామకాల వివరాలను ఆయన ఈ విధంగా వెల్లడించారు:
సచివాలయ వ్యవస్థ: వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలలు తిరక్కుండానే, ఒకే ఒక్క భారీ నోటిఫికేషన్ ద్వారా 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత గత ప్రభుత్వానిదే.
వలంటీర్ల వ్యవస్థ: గ్రామ, వార్డు స్థాయిలో ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు లక్షలాది మంది వలంటీర్లకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం జరిగింది.
ఆప్కాస్ (APCOS) నియామకాలు: ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో దళారీ వ్యవస్థను రద్దు చేసి, ‘ఆప్కాస్’ ద్వారా పారదర్శకంగా 96 వేల ఉద్యోగాలు ఇచ్చారు.
ఆర్టీసీ విలీనం: దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల కలను నెరవేరుస్తూ.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. దీని ద్వారా 58 వేల మంది ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించి, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు.
ఏపీపీఎస్సీ (APPSC): గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏకంగా 78 నోటిఫికేషన్లు విడుదల చేసి, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేశారు.
గత ప్రభుత్వ చిత్తశుద్ధికి, ప్రస్తుత ప్రభుత్వ మోసపూరిత విధానాలకు నిరుద్యోగులు బేరీజు వేసుకోవాలని మల్లు సురేంద్ర రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.




