పార్టీ లేదు బొక్కా లేదు’ మర్చిపోయావా?.. అచ్చెన్నకు బొత్స సీరియస్ వార్నింగ్!

YSR Praja News Telugu : విశాఖపట్నం: దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న బొత్స.. తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. రాజకీయ లబ్ధి కోసం, పదవుల కోసం అచ్చెన్నాయుడు అత్యంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

‘మావిగన్’ పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు!

కూటమి నేతలు ‘మావిగన్’ అనే పదం వింటేనే నిద్రలో కూడా ఉలిక్కిపడుతున్నారని బొత్స ఎద్దేవా చేశారు. ఆ భయంతోనే ఉద్దేశపూర్వకంగా డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతూ వైఎస్ జగన్‌పై బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం గర్వించదగ్గ నాయకుల్లో వైఎస్సార్ ఒకరని, ఆయన పాదయాత్ర ముగించిన చారిత్రక రోజున అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. “వైఎస్సార్ వెనుక జగన్ ఉన్నాడని నేను నీతో అన్నట్లు తప్పుడు మాటలు మాట్లాడతావా? అసలు నీకు సభ్యత, సంస్కారం ఉన్నాయా? ‘పార్టీ లేదు.. బొక్కా లేదు’ అని నువ్వు అన్న మాటలు మర్చిపోయావా?” అంటూ అచ్చెన్నాయుడికి బొత్స సూటి ప్రశ్నలు వేశారు.

అప్పటి సంతకాలతో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదు..

వైఎస్సార్ మరణించిన సమయం గురించి అచ్చెన్నాయుడు చేసిన ఆరోపణలను బొత్స తీవ్రంగా ఖండించారు. “వైఎస్సార్ చనిపోయినప్పుడు జగన్ అక్కడే ఉన్నారు. నేను, నా భార్య క్యాంప్ ఆఫీస్ నుంచి జగన్‌ను తీసుకుని వచ్చాము. చనిపోయిన మహానేతను ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు?” అని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన సంతకాల సేకరణతో వైఎస్ జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ విషయం అప్పటి సీనియర్ నేతలు రఘువీరారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణలకు కూడా స్పష్టంగా తెలుసన్నారు.

మాది విడదీయరాని బంధం..

వైఎస్సార్‌కు, తనకు మధ్య విడదీయరాని సంబంధం ఉందని బొత్స ఉద్ఘాటించారు. “వ్యక్తిగతంగా నన్ను ఏమన్నా నేను బాధపడను. కానీ, ఇంట్లో ఉన్న ఆడవాళ్ల గురించి మాట్లాడటం, రాజకీయాల కోసం, పదవుల కోసం ఇంత నీచానికి ఒడిగట్టడం దారుణం. మీ చరిత్ర మాకు తెలుసు.. మా చరిత్ర మీకు తెలుసు. నీకు దమ్ముంటే ప్రజలకు న్యాయం చేసే రాజకీయాలు చేయి, అంతేగానీ ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేయవద్దు” అని అచ్చెన్నాయుడిని బొత్స సత్యనారాయణ తీవ్రంగా హెచ్చరించారు. నువ్వు మహానేత గురించి తప్పుగా మాట్లాడావు కాబట్టే తాను ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *