వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు కోటి రూపాయలు ఇవ్వాలి: కూటమి సర్కార్‌పై వైఎస్ జగన్ ధ్వజం

YSR Praja News Telugu : విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తలమానికం, తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక అయిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (వైజాగ్ స్టీల్ ప్లాంట్) కార్మికుల పరిస్థితి ప్రస్తుతం అత్యంత అగమ్యగోచరంగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధినేత, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్నంలోని సెవెన్‌హిల్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన, ఇటీవల స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. డాక్టర్లను అడిగి వారి ఆరోగ్య పరిస్థితిని, మెరుగైన వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికార కూటమి ప్రభుత్వం (టీడీపీ-జనసేన-బీజేపీ) కార్మికుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై నిప్పులు చెరిగారు.

గుండెను పిండేస్తున్న ప్రమాద తీవ్రత

స్టీల్ ప్లాంట్‌లో జరిగిన లిక్విడ్ మెటల్ బ్లాస్ట్ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని వైఎస్ జగన్ అన్నారు. ఈ దుర్ఘటనలో ఏకంగా 9 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఐదుగురు గాయపడి చికిత్స పొందుతుండగా, వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, దాదాపు 95 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఆ కార్మికుడు పోరాడుతున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి కార్మికుల నిర్లక్ష్యం ఏమాత్రం కారణం కాదని, లిక్విడ్ మెటల్ బ్లాస్ట్ అవ్వడం వల్లే ఈ ఘోరం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. కానీ, ఇంతటి పెను విషాదం జరిగినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తున్న తీరు అత్యంత దారుణంగా, అమానవీయంగా ఉందని మండిపడ్డారు.

వైఎస్సార్సీపీ స్వర్ణయుగం.. కూటమి చీకటి పాలన

విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తొలి నుంచి అండగా నిలిచిందని, కానీ ప్రస్తుత కూటమి పాలనలో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మాజీ సీఎం గుర్తు చేశారు. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తెరపైకి తెచ్చినప్పుడు, దానిని అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు శ్రమించిందని తెలిపారు.

“ప్రైవేటీకరణ వద్దని, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని కోరుతూ అప్పటి ముఖ్యమంత్రిగా ప్రధాని నరేంద్ర మోదీకి నేను రెండుసార్లు లేఖలు రాశాను (2021 ఫిబ్రవరి 6న, మరియు మార్చి 9న రాసిన లేఖలను ఆయన మీడియం ఎదుట చదివి వినిపించారు). అంతేకాకుండా, అసెంబ్లీ వేదికగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏకగ్రీవ తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపాం” అని జగన్ వివరించారు.

కానీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఖ్యను దారుణంగా కుదించిందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి స్టీల్ ప్లాంట్‌లో 28 వేల మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. ఈ రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా 10,500 మందిని నిర్దాక్షిణ్యంగా తొలగించారని దుయ్యబట్టారు. వీరిలో 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కాగా, మరో 1,800 మందిని వీఆర్ఎస్ (VRS) పేరుతో బలవంతంగా ఇంటికి పంపించారని, మొత్తంగా ప్లాంట్‌లో ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు కుదించారని ఆయన మండిపడ్డారు.

కార్మికులపై ఆర్థిక ఉగ్రవాదం

స్టీల్ ప్లాంట్ కార్మికులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. వారికి కనీస వేతనాలు కూడా చెల్లించకుండా నాలుగు నెలలుగా జీతాలు బకాయిలు పెట్టారని మండిపడ్డారు. జీతాలను నేరుగా ప్రొడక్షన్‌కు లింక్ చేయడం ద్వారా కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని విమర్శించారు.

నివాస సముదాయాల (క్వార్టర్స్) విషయంలోనూ ప్రభుత్వం కిరాతకంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. “మా వైఎస్సార్సీపీ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్‌కు వినియోగించే విద్యుత్‌కు కేవలం 50 పైసలు మాత్రమే ఛార్జ్ చేసేవాళ్లం. కానీ, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని ఏకంగా యూనిట్‌కు రూ.8.50 పైసలకు పెంచేసింది. కరెంటు బిల్లుల భారం మోపి, కార్మికులు తమంతట తాము క్వార్టర్స్ వదిలిపెట్టి వెళ్లేలా కుట్రలు చేస్తోంది” అని జగన్ ఆరోపించారు. కార్మికులకు దక్కాల్సిన బోనస్, కనీస మెడికల్ సదుపాయాలు కూడా లేకుండా చేశారని, ప్రభుత్వం ఇస్తోన్న ప్యాకేజీ స్టీల్ ప్లాంట్ మనుగడ కోసం కాదని.. కార్మికులను బలవంతంగా గెంటేయడానికేనని ఆయన కుండబద్దలు కొట్టారు.

పెంటయ్య కుటుంబానికి న్యాయమేదీ?

ప్రస్తుత ప్రభుత్వానికి కార్మికుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పడానికి 14 నెలల క్రితం జరిగిన ఘటనే నిదర్శనమని జగన్ గుర్తు చేశారు. 14 నెలల నాడు ప్లాంట్‌లో ఇదే తరహా ప్రమాదం జరిగినప్పుడు ‘పెంటయ్య’ అనే కార్మికుడు మృత్యువాత పడ్డాడని, అప్పుడు ఒక నెల లోపు అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని అధికారులు మాట ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పటికీ ఆ మాట నిలబెట్టుకోలేదని, కనీస పరిహారం కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే.. ‘ఫైల్ పోయింది’ అంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానం చెబుతున్నారని, కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడం చరిత్రలో ఎన్నడూ చూడలేదని ఆయన మండిపడ్డారు.

లోకేశ్ అసలు మనిషేనా..? మానవత్వం లేదా?

ఇంతటి ఘోర ప్రమాదం జరిగి తొమ్మిది నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతే.. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి, సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ స్పందించిన తీరు అత్యంత హేయంగా ఉందని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “నిన్న ఆయన మాట్లాడిన మాటలు వింటే ఆశ్చర్యం వేసింది. అసలు లోకేశ్ లాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం పరిహారం ఇస్తారో చెప్పాలని అడిగితే.. దానికి కనీసం స్పందించే బాధ్యత కూడా ఆయనకు లేకుండా పోయింది” అని విమర్శించారు.

కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి.. లేదంటే మేమొచ్చాక ఇస్తాం!

గతంలో తమ ప్రభుత్వ హయాంలో ఎల్జీ పాలిమర్స్ తదితర పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు, మానవతా దృక్పథంతో ఆలోచించి, ఎక్కడా లేని విధంగా స్పాట్‌లోనే రూ. కోటి రూపాయల పరిహారాన్ని బాధిత కుటుంబాలకు అందించామని జగన్ గుర్తు చేశారు. ఏ ఆపద వచ్చినా తమ ప్రభుత్వం తక్షణమే ఆదుకుందని, కానీ నేటి చంద్రబాబు ప్రభుత్వ స్పందన పూర్తిగా శూన్యమని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం, పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చే పరిహారం కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా బాధితులకు ఏమి ఇస్తుందో చెప్పాలని జగన్ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి తక్షణమే స్టీల్ ప్లాంట్ బాధితుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా (పరిహారం) ప్రకటించాలని, అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ చంద్రబాబు ప్రభుత్వం ఈ బాధ్యత నుంచి తప్పుకుంటే, భవిష్యత్తులో వైఎస్సార్సీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులకు ఆ పరిహారం, న్యాయం తామే అందిస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు.