YSR Praja News Telugu : తాండూర్, ప్రజాప్రతినిధి: దేశంలో నిరుద్యోగ సమస్య, నీట్ (NEET) యూజీ పేపర్ లీకేజీ వంటి కీలక అంశాలపై ప్రశ్నిస్తున్న యువత, విద్యార్థి నాయకులపై జరుగుతున్న దాడులను ప్రజా సంఘాల ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్‌పై జరిగిన దాడిని ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా భావిస్తున్నామని ఐక్యవేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోందని, అలాగే నీట్ యూజీ పేపర్ లీకేజీ ఘటన దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో ఆందోళన కలిగించిందని పేర్కొన్నారు. ఇలాంటి కీలక సమస్యలపై ప్రశ్నిస్తున్న యువత, విద్యార్థి నాయకులపై భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
జైపూర్‌లో అభిజిత్ దీప్‌పై జరిగిన దాడి వెనుక ఉన్న వారిని వెంటనే గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. రాజస్థాన్ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఈ ఘటనను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరింది. నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించడమే కాకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కృషి చేస్తున్న అభిజిత్ దీప్‌కు తగిన భద్రత కల్పించాలని ఐక్యవేదిక డిమాండ్ చేసింది. సామాజిక, రాజకీయ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే వ్యక్తులపై భౌతిక దాడులు చేయడం అత్యంత ప్రమాదకర పరిణామమని పేర్కొంది. భావ ప్రకటనా స్వేచ్ఛను అణచివేసే చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, ఇలాంటి చర్యలు సమాజంలో అసహనాన్ని పెంచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
దేశ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడటం ప్రతి ప్రభుత్వ బాధ్యత అని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే విభిన్న అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, రాజ్యాంగ విలువలను పరిరక్షించడానికి అన్ని ప్రజాస్వామ్య శక్తులు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు ఈ ఘటనను ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ మైనార్టీల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వాహాబ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అప్పుల పాల సమితి జిల్లా అధ్యక్షులు కే. చంద్రయ్య, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి తాండూర్ నియోజకవర్గ ఇంచార్జ్ మహమ్మద్ సాదిక్, కెఎన్‌పీఎస్ నాయకులు గుమ్మడి రత్నం తదితర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.




