ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన.. బకాయిల వెంటనే చెల్లించాలని CITU డిమాండ్

YSR Praja News Telugu : ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి: తాండూర్ ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన వికారాబాద్ జిల్లా తాండూర్‌లో తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తాండూర్ డివిజన్ ఆర్డీవో కార్యాలయం ముందు విశ్రాంత ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేపట్టి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తాండూర్ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సీఐటీయూ వికారాబాద్ జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ సౌకర్యాలు, ఇతర బకాయిలను ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు అనేక సంవత్సరాల పాటు సంస్థ అభివృద్ధికి కష్టపడి పనిచేశారని, ఇప్పుడు వారి హక్కుగా రావాల్సిన డబ్బులను ఆలస్యం చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల పట్ల ఆర్టీసీ యాజమాన్యం అవలంబిస్తున్న మొండి వైఖరిని విడనాడాలని హెచ్చరించారు.

నిరసనలో పాల్గొన్న నాయకులు పలు ముఖ్యమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ముఖ్యంగా RPS-2017 ఎరియర్స్‌ను వెంటనే చెల్లించాలని, RPS-2021 ఎరియర్స్‌ను అమలు చేయాలని కోరారు. అలాగే బకాయి ఉన్న లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు, గ్రాట్యుటీ డిఫరెన్స్, లీవ్ ఎన్కాష్మెంట్ డిఫరెన్స్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రిటైర్ అయిన రోజే గ్రాట్యుటీ చెల్లించే విధానాన్ని అమలు చేయాలని, సెటిల్మెంట్ శాలరీ బకాయిలను క్లియర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. పీఎఫ్ పెన్షన్ శాంక్షన్‌లో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించి, తిరస్కరించిన పీఎఫ్ అప్లికేషన్లను సవరించాలని కోరారు. డీడీలు చెల్లించిన వారందరికీ పీఎఫ్ పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా మహాలక్ష్మి పథకం ప్రయోజనాలను రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని కోరుతూ నినాదాలు చేశారు. “ఆర్టీసీని అభివృద్ధి చేసింది రిటైర్డ్ ఉద్యోగులే”, “మా కష్టార్జితం డబ్బులు మాకు వెంటనే ఇవ్వాలి” అంటూ ఆందోళనకారులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సాధన కమిటీ తాండూర్ డిపో నాయకులు ఎండి సాదిక్, కే నాగేష్, జి వీరన్న, శాంత్ కుమార్, తుకారం, ఎంకే రెడ్డి, ఆర్ఆర్ సింగ్, ఆనంద్, సంజీవ్ కుమార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.