YSR Praja News Telugu : పోలీసులు మా అబ్బాయిని కొడుతుంటే ఆ అరుపులు నాకు బయటకు వినిపించాయి. ఏడెనిమిది మంది కలిసి కొట్టి.. ప్రాణాలు తీసేంతటి తప్పు నా కొడుకు ఏం చేశాడయ్యా? పోలీసులు అన్యాయంగా మా పిల్లాడిని పొట్టన పెట్టుకున్నారు.” అంటూ విజయవాడ కృష్ణలంక లాకప్ డెత్ బాధితుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు. తన ఒక్కగానొక్క కొడుకును పోలీసులు ఏ విధంగా చిత్రహింసలు పెట్టి చంపారో తలచుకుంటూ ఆమె గుండెవిలవిలలాడింది.
గురువారం సాయంత్రం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణలంకలోని బాధితుల నివాసానికి వెళ్లి సాయికృష్ణ తల్లిని, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడి తల్లి విజయలక్ష్మి, బొంగురుపోయిన గొంతుతో పోలీసుల అరాచకాలను పూసగుచ్చినట్లు వివరించారు.
స్టేషన్ చుట్టూ తిరిగినా కనికరించని కాకిమూకలు
తన కుమారుడిని పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి జరిగిన పరిణామాలను విజయలక్ష్మి వివరించారు. “మే 9వ తేదీన మార్కాపురం నుంచి సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చారు. మా వాడిని స్టేషన్ లోనే ఉంచారని స్థానిక కుర్రాళ్లు చెబితే అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్లాను. ‘మా కొడుకును ఒక్కసారి చూపించండయ్యా’ అని వేడుకున్నాను. కానీ అక్కడ ఒక కానిస్టేబుల్ ఒక మాట, ఎస్సై మరో మాట చెప్పారు. పైన ఉన్నాడని, రేపు ఇంటికి పంపించేస్తామని నమ్మబలికారు. ఆ తర్వాత మండుటెండలో స్టేషన్ చుట్టూ ఎన్నోసార్లు తిరిగాను. నేను వెళ్లినప్పుడు అక్కడ ఉన్న కొందరు యువకులు లోపల ఏం జరుగుతుందో సైగలు చేసి చెప్పడానికి ప్రయత్నించారు, కానీ నాకు సరిగా అర్థం కాలేదు. అప్పుడే పైనుంచి మా అబ్బాయి అరుపులు వినిపించాయి” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పైకి వెళ్లి కొడుకును చూసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. “అక్కడ లాకప్ లో ఉన్న కొందరు బయటకు వచ్చాక మా వాడిని ఎంత దారుణంగా కొట్టారో చెప్పారు. కాళ్ల గోళ్లు పీకేశారని, నడవలేకపోతే ఓ ఆర్ఎంపీ డాక్టర్ ని పిలిపించి కట్టు కట్టించారని చెప్పారు. కాళ్లకు ఏవో ఇంజక్షన్లు వేయడంతో కాళ్లు పూర్తిగా పని చేయకుండా పోయాయట. అత్యంత కిరాతకంగా మెడలు విరిచారని చెప్పారు. ‘అమ్మను ఒక్కసారి చూపించండి’ అని మా వాడు వేడుకున్నా ఆ రాక్షసులకు కనికరం రాలేదు. ఇద్దరు కానిస్టేబుళ్లు వాడిని నేలపై ఈడ్చుకుంటూ వెళ్లి ఒక గదిలో పడేశారు” అని విలపించారు.
రాజీ కోసం యత్నాలు.. హెబియస్ కార్పస్ పిటిషన్
చివరికి కొడుకు పరిస్థితిపై ఆందోళన చెంది, అనుమానంతో డీజీపీకి ఫిర్యాదు చేశామని, ఆ ఫిర్యాదు కాస్తా విజయవాడ సీపీ వద్దకు చేరిందని విజయలక్ష్మి తెలిపారు. “అప్పుడు పోలీసులు మా వద్దకు కొందరిని పంపించారు. ‘అయిందేదో అయిపోయింది.. రాజీ చేసుకుందాం’ అంటూ దూతలను పంపారు. తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి అమ్మిశెట్టి వాసు ఈ వ్యవహారంలో దూతగా వచ్చారు. దీంతో మాకు పోలీసులపై పూర్తి అనుమానం బలపడింది. న్యాయం కోసం జూన్ 2వ తేదీన హైకోర్టులో ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ వేశాం. నాకేమీ వద్దు.. నా కొడుకును చంపిన వారందరికీ కఠిన శిక్ష పడాలి. శవం లేకపోయినా కనీసం వాడి బూడిదైనా ఇప్పించండని అడిగినా ఎవరూ పట్టించుకోలేదు. కృష్ణలంక సీఐ నాగరాజు ముందే మా వాడిని చంపేస్తానని బెదిరించాడు. అన్నంత పనీ చేశాడు. పైగా ‘ఫొటో ఫ్రేమ్ కట్టించి దండేసుకో’ అని అత్యంత హేళనగా మాట్లాడాడు” అని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబానికి అండగా ఉంటామని, న్యాయ పోరాటంలో వెన్నంటి ఉంటామని వైఎస్ జగన్ వారికి భరోసా ఇచ్చారు.
సీఐ నాగరాజు వేధింపులకు ఎందరో బలి..
సాయికృష్ణ మేనమామలు ముళ్లపూడి నవరంగ్, నాగేశ్వరరావు, సోదరి విజయలక్ష్మి, పినతల్లి కనకదుర్గ కూడా ఈ ఘటన వెనుక ఉన్న పూర్తి చీకటి కోణాన్ని జగన్ కు వివరించారు. కృష్ణలంక సీఐ నాగరాజు చేతిలో దెబ్బతిని చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోయారని వారు ఆరోపించారు.
“ఆయన పోలీసు స్టేషన్ కు రమ్మన్నారంటే చాలు, ఈ ప్రాంతంలో యువకులు హడలిపోతున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ ఆయన కొట్టే దెబ్బలకు తాళలేక యువకులు ఊర్లు విడిచి పారిపోతున్నారు. మా అబ్బాయి సాయికృష్ణ కూడా చాలా రోజులుగా ఇక్కడ లేడు. జొమాటోలో డెలివరీ బాయ్ గా పని చేస్తూ బతుకుతున్నాడు. అలాంటి వాడిని పట్టుకొచ్చి అన్యాయంగా ప్రాణాలు తీశారు. ఇదంతా పోలీసు ఉన్నతాధికారులకు తెలిసే జరిగింది” అని బంధువులు ఆరోపించారు. ఇదే సీఐ వేధింపులు తట్టుకోలేక మే 21న క్రాంతి కుమార్ అనే మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతూ, దానికి సంబంధించిన వీడియోను జగన్ కు చూపించారు.
నా కళ్లారా చూశా.. అదంతా థర్డ్ డిగ్రీ: ప్రత్యక్ష సాక్షి
సాయికృష్ణ లాకప్ డెత్ పై అదే సమయంలో స్టేషన్ లో ఉన్న మహంకాళి చందు (అలియాస్ పూర్తి) అనే యువకుడు తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వీడియోలో ఉన్న అంశాలను కూడా బాధిత కుటుంబం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లింది.
వీడియోలో చందు చెప్పిన వివరాలు:
“గాదె సాయికృష్ణను స్టేషన్ కు తీసుకొచ్చిన రోజు నేను కూడా అక్కడే లాకప్ లో ఉన్నాను. ఆ రోజు ఏం జరిగిందో నా కళ్లారా చూశాను.”
“సాయిని అత్యంత కిరాతకంగా చిత్రహింసలు పెట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి, శరీరంలోని సున్నిత భాగాల్లో కరెంట్ షాక్ ఇచ్చారు. బాబురావు, నాని అనే వాళ్లు సాయిని పట్టుకుని ఇష్టానుసారంగా కొట్టారు.”
“సీలింగ్ తెగిపోయిందని మొత్తుకుంటున్నా సీఐ వినలేదు. ఆ తర్వాత నన్ను, మిగతా వాళ్లను స్టేషన్ నుంచి బయటకు పంపేశారు.”
“సాయి అమ్మాయిలను ఏడిపించాడంటూ పోలీసులు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏ అమ్మాయి అయినా అతనిపై ఫిర్యాదు చేసిందా? తప్పు చేస్తే జైల్లో పెట్టాలి, శిక్ష ఖరారు చేయాల్సింది కోర్టు. కానీ ఇలా చంపే హక్కు వాళ్లకెక్కడిది?”
“ఈ విషయాలు బయటపెడితే నన్ను కూడా చంపేస్తారని బెదిరిస్తున్నారు. ఏది ఏమైనా నేను మీడియా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఏపీలో న్యాయం బతకాలి.”
సాయికృష్ణ లాంటి ఓ నిరుపేద యువకుడిని అకారణంగా బలితీసుకున్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి సత్వర న్యాయం జరగాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరామర్శ కార్యక్రమంలో జగన్ తో పాటు వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, వెలంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, ఇతర పార్టీ నేతలు వంగవీటి నరేంద్ర, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




