ఏపీలో ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ: కూటమి ప్రభుత్వ దౌర్జన్యంపై వైఎస్ జగన్ ఆగ్రహం

YSR Praja News Telugu : తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ దౌర్జన్యంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆయన ఆరోపించారు. దేశానికి ప్రజాస్వామ్యంపై నీతులు చెప్పే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చినందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్సీపీ అధినేత తాడేపల్లి నుంచి ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ, “ఒక చిన్న ఎంపీపీ ఉప ఎన్నికలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఇంత దారుణంగా ఖూనీ చేయడం కూటమి ప్రభుత్వపు తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకరమైన స్వభావాన్ని బట్టబయలు చేస్తోంది. ఎన్నికలను ప్రజాస్వామ్య ప్రక్రియగా కాకుండా బలప్రదర్శన వేదికగా మార్చేశారు” అని విమర్శించారు.
ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్తున్న వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నడిరోడ్డుపై అడ్డుకుని దాడులు చేసినట్టు జగన్ ఆరోపించారు. ఈ ఘటనలో ఓ మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడగా, ఒక సభ్యుడిని కిడ్నాప్ చేయడం, మరొకరిని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగిందన్నారు. వీటన్నింటి వెనుక ఒకే లక్ష్యం ఉందని, ఎంపీపీ ఉప ఎన్నికలో తమ సభ్యులు ఓటు వేయకుండా అడ్డుకోవడమేనని తెలిపారు.
ఇలాంటివే సంఘటనలు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్ మండలంలోనూ చోటు చేసుకున్నాయని జగన్ పేర్కొన్నారు. అక్కడ కూడా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను నిర్బంధించి దూరంగా ఉంచారని, ఇంత జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు మూగ ప్రేక్షకుల్లా వ్యవహరించారని విమర్శించారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు బాసటగా నిలిచి, బలవంతంగా ఎన్నికలను పూర్తిచేశారని ఆరోపించారు.
ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేయడం, వారిపై బహిరంగ దాడులు చేయడం, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేయడం కూటమి ప్రభుత్వంలో సర్వసాధారణమైపోయిందని వైఎస్ జగన్ మండిపడ్డారు. “ఒక చిన్న స్థానిక సంస్థ ఉప ఎన్నికలోనే ప్రజాస్వామ్యం పరిస్థితి ఇలా ఉంటే, ఈ ప్రభుత్వం ఎంత అధికార దుర్వినియోగం చేస్తోంది, ఎంత ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మారిందో స్పష్టంగా కనిపిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *