ఇసుక వేలం పాటలో అక్రమాలు.. ఆర్ఐ చరణ్ కుమార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: సీఐటీయూ డిమాండ్

YSR Praja News Telugu : వికారాబాద్, జూన్ 21,వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో ఇటీవల నిర్వహించిన ఇసుక వేలం పాటలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, సంబంధిత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్ఐ) చరణ్ కుమార్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టే విధంగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక వేలం నిర్వహించారని ఆరోపించారు. యాలాల మండల పరిధిలో అనుమతులు లేకుండా తరలిస్తున్న సుమారు 120 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు.

 

అయితే, ఆ ఇసుకను వేలం వేసే ప్రక్రియలో పారదర్శకత పాటించకుండా ఆర్ఐ చరణ్ కుమార్ వ్యవహరించారని కే శ్రీనివాస్ ఆరోపించారు. బహిరంగ పత్రికా ప్రకటన జారీ చేయకుండా, ప్రజలకు సమాచారం అందించకుండా కొంతమంది కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఏకపక్షంగా వేలం నిర్వహించడం నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు.

 

వేలం ప్రక్రియకు సంబంధించి ఉన్నతాధికారుల అనుమతులు, అవసరమైన సంతకాలు లేకుండానే సొంత నిర్ణయాలతో వ్యవహరించారని, దీని వెనుక పెద్ద ఎత్తున అవినీతి జరిగి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈ అక్రమాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

 

ఇప్పటికే ఆర్ఐ చరణ్ కుమార్‌పై భూ వివాదాలు, ఎర్రమట్టి అక్రమ రవాణా వంటి పలు ఆరోపణలు ఉన్నాయని కే శ్రీనివాస్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనపై సమగ్ర విచారణ జరిపి, విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన తీవ్రం

 

ఇసుక వేలం పాటలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం వెంటనే స్పందించి, సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కే శ్రీనివాస్ హెచ్చరించారు.

 

అలాగే ప్రస్తుతం నిర్వహించిన వేలం ప్రక్రియను వెంటనే రద్దు చేసి, అన్ని నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా తిరిగి వేలం నిర్వహించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.