YSR Praja News Telugu : తాండూర్, జూన్ 26: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని మల్‌రెడ్డిపల్లి గ్రామానికి చెందిన అరుణపై జరిగిన దాడి ఘటనపై ప్రజాసంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధితురాలిపై దాడి చేసిన వారితో పాటు ఘటనకు సహకరించిన వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
శుక్రవారం తాండూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఘటన వివరాలను వెల్లడించారు.
వారి కథనం ప్రకారం, మల్‌రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ (22) ఈ నెల జూన్ 17 సాయంత్రం సుమారు 5:30 గంటల సమయంలో తన చిన్నమ్మ అయిన మిట్ట అరుణపై భూమి వివాదాల నేపథ్యంలో రోకలి కర్రతో తీవ్రంగా దాడి చేశాడని తెలిపారు. ఈ దాడిలో అరుణకు రెండు చేతులు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు.
దాడి అనంతరం అరుణ మృతి చెందినట్లు భావించిన ప్రవీణ్ కుమార్ తాండూర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిపారు. అయితే తీవ్ర గాయాలతో ఉన్న అరుణ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు చెప్పారు.
ప్రజాసంఘాల నాయకుల ఆరోపణల ప్రకారం, అరుణ కుటుంబం అమాయకమైందని, ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని తెలిపారు. ఆస్తి వివాదాల కారణంగానే ఈ దాడి జరిగినట్లు ఆరోపించారు. అలాగే ఈ ఘటనకు ప్రవీణ్ కుమార్ తల్లిదండ్రులు వెంకటప్ప, గంగమ్మ కూడా ప్రోత్సాహం ఇచ్చారని ఆరోపిస్తూ, వారిపైనా హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
బాధితురాలు అరుణ కుటుంబానికి ప్రభుత్వం, పోలీసు శాఖ పూర్తి న్యాయం చేయాలని, కేసును వేగంగా విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య, టీఎస్‌ఎంహెచ్‌పీఎస్ తాండూర్ ఇంచార్జ్ మహ్మద్ సాదిక్, బాలప్ప, రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.




