YSR Praja News Telugu : అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రదానం చేసే నంది అవార్డుల నిబంధనల్లో కూటమి ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగస్థల కళాకారులకు ఇచ్చే ‘డాక్టర్ వైఎస్ఆర్ రంగస్థల పురస్కారం’ నుంచి ‘వైఎస్ఆర్’ పేరును తొలగించింది. ఈ మేరకు ఏపీ స్టేట్ నంది థియేటర్ అవార్డుల నిబంధనలను సవరిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
నగదు బహుమతి రూ.లక్షకు తగ్గింపు
పేరు మార్పుతో పాటు ఈ పురస్కారం కింద ఇచ్చే ప్రైజ్ మనీలోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. గతంలో ఈ అవార్డు కింద ఇస్తున్న రూ. 5 లక్షల నగదు బహుమతిని రూ. 1 లక్ష రూపాయిలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
84 మందికి కందుకూరి విశిష్ట పురస్కారాలు
మరోవైపు, నాటక రంగానికి సేవలుందించిన కళాకారులను ప్రోత్సహించేందుకు ‘కందుకూరి విశిష్ట పురస్కారాలను’ ప్రకటించనుంది. రాష్ట్రంలోని ప్రతీ జిల్లా నుంచి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి, మొత్తం 84 మంది కళాకారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున నగదు పురస్కారాన్ని అందించనున్నట్లు వెల్లడించింది.
అక్టోబర్ 20లోగా దరఖాస్తుల ఆహ్వానం
2025 సంవత్సరానికి గాను ‘నంది నాటక అవార్డుల’ పోటీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏపీ చలనచిత్ర, టెలివిజన్, నాటకాభివృద్ధి సంస్థ (APSFTVTDC) ఎండీ విశ్వనాథన్ తెలిపారు. తెలుగులో పద్య, సాంఘిక, బాలల నాటికలకు సంబంధించి నాటక సమాజాలు అక్టోబర్ 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల కళాకారులు, సమాజాలు అధికారిక వెబ్‌సైట్ www.apsftvtdc.in ద్వారా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సమర్పించాలని కోరారు.




