YSR Praja News Telugu :అమరావతి:‘‘సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 143 హామీలకు చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడింది. మూడేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలనూ తీవ్రంగా మోసం చేసిన చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటేస్తారు? ఏం చేశాడని మళ్లీ ఆదరిస్తారు?’’ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి మూడేళ్ల పాలన తీరుతెన్నులు, ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న ప్రజాస్వామ్య ఉల్లంఘనలు, సంక్షేమ పథకాల రద్దుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హామీల వర్షం.. అధికారంలోకి వచ్చాక తిలోదకాలు
ఎన్నికల సమయంలో ప్రజలను బురిడీ కొట్టించడానికి హామీల వర్షం కురిపించి, ప్రతి ఇంటికీ బాండ్లు ఇచ్చారని వైఎస్ జగన్ మండిపడ్డారు. జూన్ 2024 నుంచి కొత్త సినిమా ప్రారంభమవుతుందని నమ్మించి, అధికార పీఠం ఎక్కాక ఒక్కొక్కటిగా హామీలన్నింటికీ తిలోదకాలు ఇచ్చారని విమర్శించారు.
- మహిళలకు తీవ్ర అన్యాయం: ‘ఆడబిడ్డ నిధి’ పేరిట అక్కచెల్లెమ్మలకు అడ్డగోలుగా హామీలిచ్చి మోసం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలైన ఆసరా, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం వంటి సంక్షేమ పథకాలను పూర్తిగా రద్దు చేశారు. చివరికి సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగ్గొట్టడంతో ఈరోజు ప్రతి గ్రామంలోనూ అక్కచెల్లెమ్మలు చంద్రబాబును నిలదీసే పరిస్థితి వచ్చిందన్నారు.
- విద్యార్థులు, నిరుద్యోగుల ఆవేదన: ప్రతి నెలా రూ.3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పారని, చదువుకుంటున్న విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను నీరుగార్చారని ఆరోపించారు.
- రైతన్నల అగచాట్లు: రైతాంగానికి ఉచిత పంటల బీమా లేక, సమయానికి ఇన్పుట్ సబ్సిడీ అందక, సున్నా వడ్డీ రుణాలు రాక తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కోలుకోలేని దెబ్బతిన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యవస్థల ధ్వంసం.. సేవ్ ఆంధ్రాగా మారిన రాష్ట్రం
వైఎస్సార్సీపీ హయాంలో పారదర్శక పాలనకు చిహ్నాలుగా నిలిచిన గ్రామ/వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు), వలంటీర్ వ్యవస్థలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని జగన్ విమర్శించారు.
- ఆరోగ్యశ్రీకి గ్రహణం: ప్రభుత్వ వైద్యరంగం తీవ్ర సంక్షోభంలో పడిపోయిందని, ఆసుపత్రుల్లో కనీసం మందులు దొరకడం లేదని చెప్పారు. రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందించిన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తుతం వెెంటిలేటర్‌పై ఉందన్నారు.
- ఉద్యోగులకు మోసం: ఉద్యోగులకు ఇచ్చిన ఐఆర్, పీఆర్సీ హామీలు నీటిమూటలయ్యాయని, ఐదు డిఏలు పెండింగ్‌లో పెట్టి దాదాపు రూ.40,000 కోట్ల బకాయిలను పేరుకుపోయేలా చేశారని తెలిపారు.
- ఆస్తుల విక్రయాలు & స్కామ్‌లు: తమ ప్రభుత్వంలో తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలలను, ఓడరేవులు, హార్బర్లను స్కామ్‌లు చేస్తూ పప్పుబెల్లాల్లా అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. ప్రభుత్వ భూములను తమ అనుచరులకు పావలాకో రూపాయికో కట్టబెడుతున్నారని, ఏపీ అంటే ప్రస్తుతం “ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్” అన్నట్లుగా తయారైందని వ్యాఖ్యానించారు.
’సౌత్ బిహార్’తో పోల్చేలా లా అండ్ ఆర్డర్ క్షీణత
రాష్ట్రంలో ఎక్కడ చూసినా లిక్కర్, గంజాయి మాఫియాలు రాజ్యమేలుతున్నాయని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని పేరిట, మట్టి, ఇసుక, లేటరైట్ లలో స్కామ్‌లు జరుగుతున్నాయని, గతంలో ‘సేఫ్ ఆంధ్రా’గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు ‘సేవ్ ఆంధ్రా’గా దిగజారిపోయిందని చెప్పారు. ఒకప్పుడు గౌరవప్రదంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఈరోజు ‘సౌత్ బిహార్’తో పోల్చే పరిస్థితి తెచ్చారని విమర్శించారు.
డిజిటల్ విప్లవం నడుస్తున్న ఈ యుగంలో జెన్ జీ (Gen Z) ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా గొంతు విప్పుతుంటే, చంద్రబాబు మాత్రం రిగ్గింగ్ ఎలా చేయాలి, సైక్లింగ్ ఎలా చేయాలి, ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేయాలో ట్యూషన్ పెట్టి మరీ నేర్పిస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ఎస్ఈసీ, పోలీసులు, ప్రభుత్వ అధికార యంత్రాంగాల విశ్వసనీయతను చంద్రబాబు తన స్వార్థం కోసం పూర్తిగా దెబ్బతీశారని ఆరోపించారు.
ఎన్నికల హైజాక్.. చట్టప్రకారం నేరం
ఎన్నికలు నిజంగా స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగితే ఎక్కడ తన పొలిటికల్ అడ్రస్ గల్లంతవుతుందోనన్న భయంతోనే చంద్రబాబు ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని హైజాక్ చేశారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
- ఎలక్షన్ సబ్‌వెర్షన్: ఇది కేవలం ఎన్నికల మానిప్యులేషన్ మాత్రమే కాదని, వ్యవస్థాగతంగా ప్రజాస్వామ్యాన్ని ఆక్రమించడం (Organised capture of democracy), ప్రజల ఓటు హక్కును, పోటీ చేసే హక్కును కాలరాయడమేనని స్పష్టం చేశారు. ఇవన్నీ చట్టప్రకారం తీవ్రమైన నేరాలని పేర్కొన్నారు.
- కార్యకర్తలకు సెల్యూట్: అణిచివేతను ఎదుర్కొని నిలబడి, ప్రజాస్వామ్య హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అసలైన హీరోలని, వారికి సెల్యూట్ చేస్తున్నానని ప్రకటించారు. “ఈ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి ఓడారు.. మేము ఓడి ప్రజల మనసుల్లో గెలిచాం” అని వ్యాఖ్యానించారు.
తుపాను బాధితులకు శూన్య సాయం
ఒకవైపు రాష్ట్రం వరుసగా రెండు తుపానుల (అర్నాబ్, మురసు) ధాటికి తీవ్రంగా నష్టపోతుంటే, ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడడంలో పూర్తిగా విఫలమైందని జగన్ మండిపడ్డారు. అర్నాబ్ తుపానులో 10 మంది, మురసు తుపానులో ఇద్దరు చనిపోయారని, పది రోజులవుతున్నా ఇప్పటికీ 150 గ్రామాలకు విద్యుత్ పునరుద్ధరించలేదని విమర్శించారు.
13 నెలల క్రితం వచ్చిన మోంథా తుపాను బాధితులకు ఇప్పటివరకు జీవోలు ఇవ్వడమే తప్ప పైసా సాయం చేయలేదని ఎత్తిచూపారు. రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం నుంచి దమ్మిడీ సాయం అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసులకు భయపడే ప్రసక్తే లేదు
ఎన్నికల్లో జరిగిన అన్యాయంపై రిటర్నింగ్ ఆఫీసర్ (RO) కి ఫిర్యాదు చేయడం కూడా ఈ రాష్ట్రంలో తప్పేనా అని జగన్ ప్రశ్నించారు. 70 మంది పోలింగ్ ఏజెంట్ పాస్‌లు ఉన్నవారిని బూత్‌ల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారంటూ, శాంతియుతంగా గాంధేయ మార్గంలో ఆర్వో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపినట్లు వివరించారు.
శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై పోలీసులు కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. “రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు, ఆస్తి హక్కులు ప్రమాదంలో పడ్డాయి. సెక్షన్ 22ఏ కింద లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చారు. రేపొద్దున మీ ఆస్తి పత్రాలతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్తే లాక్కొని చించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి” అని హెచ్చరించారు.
చివరగా, “హే రామ్.. సేవ్ ఆంధ్రా.. హే రామ్.. సేవ్ డెమోక్రసీ” అని నినదిస్తూ వైఎస్ జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.

