యువత, రైతులు తిరగబడితే కాంగ్రెస్ నేతలు బయట తిరగలేరు’: సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ధ్వజం

YSR Praja News Telugu : మంచిర్యాల: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో యువత చేస్తున్న ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం గడగడలాడుతోందని, త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా యువత, రైతుల నుంచి ఇటువంటి పరిస్థితే ఎదురవుతుందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో మాజీ ఎమ్మెల్యే ఎన్. దివాకర్ రావు అధ్యక్షతన నిర్వహించిన ‘రైతు సదస్సు’లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

రైతులను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువుతో రైతులు అల్లాడిపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నో గండాలను దాటిన రైతన్నలు, ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే గండాన్ని మాత్రం దాటలేకపోతున్నారని ఆయన విమర్శించారు. పాము తన సొంత పిల్లలనే తిన్నట్లుగా, సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులను చెప్పలేని కష్టాలకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు రైతుబంధు ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రైతులనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. యువ సంగ్రామ సదస్సుతో ప్రభుత్వాన్ని ఎండగట్టామని, యువత చేతికి రేవంత్ రెడ్డి దొరికితే తీవ్రంగా కొట్టేంత కోపంతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి సోయి లేదు

గోదావరి, ప్రాణహిత నదులు ఉరకలెత్తుతున్నా పరిపాలిస్తున్న ప్రభుత్వానికి కనీస సోయి లేదని కేటీఆర్ విమర్శించారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 94 మీటర్ల ఎత్తులో నీరు పారుతోందని, అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలను నడిపిస్తే రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని ఆయన సూచించారు. కన్నెపల్లి వద్ద నీళ్లు ఎత్తిపోయొద్దని ఎన్డీఎస్ఏ (NDSA) ఏమైనా చెప్పిందా? అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ వద్ద కేవలం రెండు పిల్లర్లు మాత్రమే కుంగితే, ఎల్ అండ్ టీ (L&T) సంస్థ రూ. 400 కోట్లతో వాటిని రిపేరు చేస్తామని ముందుకొచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు నాయుడు ఏపీలో పట్టిసీమ లిఫ్టును విజయవంతంగా నడిపిస్తున్నారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలిసింది కేవలం ఒట్లు వేయడం, తిట్లు తిట్టడం మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు.

‘జాతి’ విమర్శలపై గట్టి కౌంటర్: ఓటుకు నోటు కేసు ప్రస్తావన

తన జాతి గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. “ఏ జాతి నీది అంటున్నారని, తెలంగాణలో ఓ ఎమ్మెల్యేను రూ. 50 లక్షలతో కొనుగోలు చేసేందుకు బ్యాగులతో వెళ్లిన జాతి తమది కాదని” ఓటుకు నోటు కేసును ఉద్దేశించి ఘాటుగా బదులిచ్చారు. తెలంగాణలో ఉన్నవి రెండే జాతులని, అందులో ఒకటి రాష్ట్రాన్ని ప్రేమించే జాతి అయితే, మరొకటి రాష్ట్రానికి ద్రోహం చేసే జాతి అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు వరంగల్ రైతు డిక్లరేషన్ సందర్భంగా ఇచ్చిన హామీల వీడియోను ప్రదర్శించి, వారి వైఫల్యాలను ఎండగట్టారు.

మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల సాయం

ఇటీవల వచ్చిన గాలివానకు వరిధాన్యాన్ని కాపాడుకునేందుకు వెళ్లి గోడ కూలి మరణించిన నలుగురు రైతుల కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ భరోసా ఇచ్చారు. తనుగుల నాగరాజు, తనుగుల అభిరాం, నెల్కి లచ్చన్న, గుండారపు వెంకటేశ్ అనే రైతుల కుటుంబాలకు పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ తరఫున ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

పాల్గొన్న ముఖ్య నాయకులు

ఈ రైతు సదస్సులో ఆసిఫాబాద్, బాల్కొండ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్సీలు టీ. జీవన్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోరుకంటి చందర్, కోనేరు కోనప్ప, దాసరి మనోహర్ రెడ్డి తదితర ముఖ్య నేతలు, స్థానిక నాయకులు రామ్మోహన్ రావు, జాన్సన్ నాయక్, విజిల్ రావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.