YSR Praja News Telugu : హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలన, నెరవేర్చని హామీలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “స్కూటీ లేదు.. లూటీ మాత్రమే నడుస్తోంది. రైతుబంధు పోయి.. రాహుల్ బంధు నడుస్తోంది” అంటూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో జరిగిన బీఆర్ఎస్ కంటోన్మెంట్ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.. త్వరలో జరగనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SSR) పై పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు.
ఓట్ల తొలగింపు కుట్రలపట్ల అప్రమత్తంగా ఉండాలి
జూన్ 25 నుంచి ఓటర్ల జాబితా సవరణ (SSR) ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కంటిమీద కునుకు లేకుండా పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కంటోన్మెంట్ ఓటర్లకు సూచన: డిఫెన్స్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న సుమారు 35 వేల మంది తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు విధిగా ఈ సవరణ ప్రక్రియలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇతర రాష్ట్రాల ఉదాహరణలు: ఓట్ల తొలగింపులో జరిగే కుట్రలను వివరిస్తూ.. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఏకంగా 95 లక్షల ఓట్లు, బీహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించారని కేటీఆర్ గుర్తు చేశారు. వాళ్లు కోర్టుకు వెళ్లినా.. ఆ లోపే ఎన్నికలు జరిగిపోయాయని, కాబట్టి మన ఓట్లు గల్లంతు కాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తీరాలని హెచ్చరించారు.
420 హామీలతో రైతాంగానికి మోసం
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 మోసపూరిత హామీలను నమ్మి గ్రామీణ ప్రజలు వారికి ఓట్లు వేశారని, కానీ హైదరాబాద్ ప్రజలు మాత్రం బీఆర్ఎస్‌ను నమ్మి అండగా నిలిచారని కేటీఆర్ ప్రశంసించారు. దేశమంతా కాంగ్రెస్ దరిద్రాన్ని వదిలించుకుంటే, మనం మాత్రం నెత్తి మీద పెట్టుకున్నామని ఎద్దేవా చేశారు.
వ్యవసాయం-విద్యుత్: గత కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలకు వారానికి మూడు రోజులు పవర్ హాలిడే ఉండేదని, 65 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని కేసీఆర్ కేవలం ఆరు నెలల్లోనే చేసి చూపించారని గుర్తుచేశారు. రైతులకు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలు అన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు 24 గంటలు ఇస్తున్నామని ప్రగల్భాలు పలకడం విడ్డూరంగా ఉందన్నారు.
రైతులకు ఉరితాడుగా ‘రైతు డిస్కం’: రాష్ట్రంలో రైతులకు యూరియా ఇచ్చే దిక్కులేదని, పండించిన ధాన్యం కొనే నాథుడు లేడని కేటీఆర్ మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ‘రైతు డిస్కం’ తెస్తామంటున్నారని.. అది రైతులను ఆదుకోవడానికి కాదని, వారికి ఉరి వేయడానికేనని తీవ్ర విమర్శలు చేశారు.
రెండున్నరేళ్లలో ఒక్క పట్టా అయినా ఇచ్చారా?
పేదల ఇళ్ల స్థలాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని కేటీఆర్ ఎండగట్టారు. కేసీఆర్ హయాంలో సుమారు 2 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని, కానీ ఈ రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి పేదలకు ఒక్కటంటే ఒక్క ఇళ్ల పట్టా అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి లూటీ చేయడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని కేటీఆర్ విమర్శించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ స్థాయి నుంచి సమన్వయంతో పనిచేసి, ఓటర్ల జాబితా సవరణలో చురుగ్గా పాల్గొనాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.




