YSR Praja News Telugu : విజయవాడ: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం విజయవాడలోని లోక్ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)చేత విచారణ జరిపించాలని ఆయన గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగిన దాడి ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన వైఎస్ జగన్, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.
శాంతియుత ర్యాలీపై దాడి దారుణం
డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలకు నిరసనగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన శాంతియుత ర్యాలీపై టీడీపీ గూండాలు దాడులకు పాల్పడ్డారని జగన్ మండిపడ్డారు. ఈ ఘటనపై మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ, డీఎస్సీ-2025 నియామక వ్యవహారంలో వైఎస్సార్సీపీ చేపట్టిన పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు.
అడ్డంగా దొరికిపోవడంతోనే దాడులు!
టీడీపీ శ్రేణుల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “అది యువగళం టీమ్ కాదు.. పక్కా రౌడీ దళం” అని దుయ్యబట్టారు. డీఎస్సీ స్కామ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌లు అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు.
తాము సీబీఐ విచారణను డిమాండ్ చేస్తుంటే తట్టుకోలేక, స్కామ్‌లను బయటపెడుతున్నారనే కక్షతోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ఈ స్కామ్‌పై సమగ్ర విచారణ జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.




