
YSR Praja News Telugu : తిరుపతి: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. మాజీ మంత్రులు, సీనియర్ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాధాకృష్ణకు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించారు.
ఆంధ్రజ్యోతి ప్రతుల దహనం.. పోలీసులతో వాగ్వాదం
రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతి, చిత్తూరు జిల్లాల వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళనలో భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కే రోజా, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు వెంకట గౌడ, సునీల్ కుమార్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహంతో ఆంధ్రజ్యోతి దినపత్రికలను రోడ్డుపై తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు వైఎస్సార్సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
బ్రోకరిజంతో బతుకుతున్నావు.. రాధాకృష్ణపై రోజా ఫైర్
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణపై నిప్పులు చెరిగారు. జర్నలిజానికి ఎలాంటి విలువ ఇవ్వకుండా బ్రోకరిజంతో బతుకుతున్న రాధాకృష్ణపై రాష్ట్రంలోని మహిళలంతా ఎదురుతిరుగుతున్నారని ఆమె మండిపడ్డారు.
రోజా చేసిన ముఖ్యమైన వ్యాఖ్యలు:
మహిళల గురించి మాట్లాడే అర్హత లేదు: “రాధాకృష్ణకు కూతురు లేదా? మా నాయకులు, మహిళల గురించి తప్పుడు కూతలు కూసే అర్హత నీకు ఎక్కడిది?” అని రోజా ప్రశ్నించారు.
సైకిల్ నుంచి వేల కోట్లకు: “ఒకప్పుడు డొక్కు సైకిల్ పై వచ్చిన నువ్వు, ఈరోజు వేల కోట్లకు ఎలా ఎదిగావో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబుకు బ్రోకర్‌గా పనులు చేస్తూ ఈ స్థాయికి వచ్చావు.”
కొవ్వు కరిగిస్తాం: “కొత్త పలుకు పేరుతో కొవ్వెక్కి రాతలు రాస్తున్నాడు.. ఆ కొవ్వు కరిగిస్తాం, కొవ్వు తగ్గిస్తాం. మా నాయకుల కుటుంబ సభ్యులను ఏమన్నా అంటే చూస్తూ ఊరుకునేది లేదు. నీ అవినీతి పత్రికలను తగలబెడతాం.”
ఆఫీస్ తగలబెడతాం: “చంద్రబాబు, పవన్, మంత్రులను సూటిగా హెచ్చరిస్తున్నాం. మీరు తిట్టిస్తే.. మాకు తిట్టడం చేతకాక కాదు, మా సంస్కారం అడ్డు వస్తోంది. మేము తిట్టడం మొదలుపెడితే మీరు రోడ్లపై తిరగలేక సిగ్గుతో తలదించుకుంటారు. మహిళల గురించి ఇకపై తప్పుగా రాస్తే ఆంధ్రజ్యోతి ఆఫీస్‌ను తగలబెట్టేస్తాం.”
రాయలసీమ ద్రోహి చంద్రబాబు: రోజా
అంతకుముందు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆర్కే రోజా, సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు.
అమరావతికి లక్షల కోట్లు.. సీమకు నిధుల్లేవా?: “రాయలసీమకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ. 2 వేల కోట్లు ఖర్చు చేయలేని చంద్రబాబు, అమరావతి కోసం రూ. 2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తారు? ఈ రెండేళ్లలోనే అమరావతికి రూ. 8 వేల కోట్లు కేటాయించారు.”
రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం: “తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారు. రాయలసీమ ద్రోహి అయిన చంద్రబాబు ఈ ప్రాంతంలో పుట్టడం ఇక్కడి ప్రజల దురదృష్టం.”
రాయలసీమ గొంతు కోయడమే: “రాయలసీమ ప్రాజెక్టును నిలిపివేయడం అంటే ఈ ప్రాంత ప్రజల గొంతు కోయడమే. ఇప్పటికే 87 శాతం పూర్తయిన ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను ప్రజలకు తెలియజేయాలి.”
మహా ఉద్యమం తప్పదు:
రాయలసీమ ప్రాజెక్టుల సాధన కోసం రాబోయే రోజుల్లో పాదయాత్రలు, మహా ఉద్యమాల ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తామని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు.




