ఈరోజు నుంచి పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన – ప్రజాదర్బార్ షెడ్యూల్ విడుదల

YSR Praja News : తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుంచి (డిసెంబర్ 23, మంగళవారం) పులివెందులలో మూడు రోజుల పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు ప్రజాప్రయోజన కార్యక్రమాలతో పాటు క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొననున్నారు.

మంగళవారం సాయంత్రం పులివెందుల చేరుకున్న అనంతరం భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను నేరుగా విననున్నారు. రాత్రికి అక్కడే నివాసంలో బస చేయనున్నారు.

బుధవారం ఉదయం పులివెందుల నుంచి ఇడుపులపాయకు వెళ్లనున్న వైఎస్ జగన్, ప్రేయర్ హాల్‌లో నిర్వహించే క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తిరిగి పులివెందులకు చేరుకుని భాకరాపురం క్యాంప్ ఆఫీసులో మరోసారి ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. ఆ రోజూ పులివెందులలోనే బస చేస్తారు.

గురువారం ఉదయం 8.30 గంటలకు క్రిస్మస్ సందర్భంగా సీఎస్ఐ చర్చిలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం పులివెందుల నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.

వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *