
YSR Praja News : అమరావతి, వైయస్సార్ ప్రజా న్యూస్ ప్రతినిధి | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల ప్రాణాలకు భరోసాగా నిలిచిన 108, 104 అంబులెన్స్ సేవలు క్రమంగా కనుమరుగవుతున్నాయని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మల్లు సురేంద్ర రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగా వైద్యారోగ్య రంగం పూర్తిగా నిర్వీర్యమై, సామాన్య ప్రజల ఆరోగ్య భద్రత ప్రమాదంలో పడిందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసి ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు.
మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజల ఆరోగ్య హక్కును కాపాడాలనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ పథకం, 108, 104 అంబులెన్స్ సేవలను రాష్ట్రంలో ప్రవేశపెట్టారని సురేంద్ర రెడ్డి గుర్తు చేశారు. ఈ వ్యవస్థల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ అత్యవసర వైద్య సేవలు వేగంగా అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. అనంతరం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైద్యారోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వివరించారు.
జగన్ ప్రభుత్వ కాలంలో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించి పేదలకు ఖరీదైన చికిత్సలు సైతం ఉచితంగా అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. అలాగే 108, 104 అంబులెన్స్ వాహనాలకు ఆధునిక లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అయిన ఏఎల్‌ఎస్ (ALS), బీఎల్‌ఎస్ (BLS) సదుపాయాలు కల్పించి, అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేశారని అన్నారు. వాహనాల సంఖ్యను కూడా భారీగా పెంచి జిల్లాల స్థాయిలో సేవలు వేగవంతం చేశారని గుర్తుచేశారు.
అదేవిధంగా రాష్ట్రంలో వైద్య విద్య, సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలకు చేరువ చేయాలనే లక్ష్యంతో 17 నూతన మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కళాశాలల ద్వారా స్థానికంగా వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు, గ్రామీణ యువతకు వైద్య విద్య పొందే అవకాశం పెరిగిందని చెప్పారు.
కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైద్యారోగ్య రంగంపై నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని సురేంద్ర రెడ్డి ఆరోపించారు. నిర్వహణ లోపాలు, నిధుల కొరత, ఇంధన బకాయిలు వంటి కారణాలతో వందలాది 108, 104 అంబులెన్స్‌లు షెడ్లకే పరిమితం అయ్యాయని తెలిపారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సమయానికి రాకపోవడంతో గర్భిణీలు, ప్రమాద బాధితులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగులు ప్రాణాపాయంలో పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఆరోగ్యశ్రీ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల అనేక నెట్‌వర్క్ ఆసుపత్రులు పేద రోగులను వెనక్కి పంపుతున్నాయని తెలిపారు. ఫలితంగా సామాన్య ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నారు. ఇది పేద ప్రజల ఆరోగ్య హక్కులపై ప్రత్యక్ష దాడి అని విమర్శించారు.
నూతన మెడికల్ కాలేజీల నిర్మాణాలను పక్కనపెట్టి, వాటికి అవసరమైన వసతులు, సిబ్బంది నియామకాలను ఆలస్యం చేయడం ద్వారా వైద్య విద్యను ప్రైవేటీకరణ వైపు నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని సురేంద్ర రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు బలహీనపడితే పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు చైతన్యవంతులై తమ హక్కుల కోసం పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. విద్య, వైద్యం ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులని గుర్తు చేస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వాన్ని నిలదీయే వరకు ప్రజా పక్షాన పోరాటం కొనసాగుతుందని మల్లు సురేంద్ర రెడ్డి స్పష్టం చేశారు.




