
YSR Praja News : డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆస్తుల విలువ రూ.250 కోట్లు
ఏసీబీ వలలో చిక్కిన రవాణా శాఖ తిమింగలం
మహబూబ్‌నగర్ జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం. కిషన్ నాయక్ అవినీతి ఆరోపణలతో ఏసీబీకి చిక్కారు. హైదరాబాద్ నగరంలోని బోయినపల్లిలో నివాసం ఉంటున్న ఆయనపై అక్రమ ఆస్తుల కేసులో విస్తృత స్థాయిలో దాడులు చేపట్టారు.
ఏసీబీ అధికారులు కిషన్ నాయక్ నివాసంతో పాటు, నిజామాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో ఉన్న ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో మొత్తం 12 చోట్ల ఒకేసారి సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రాథమిక విచారణలో నారాయణఖేడ్ ప్రాంతంలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, నిజామాబాద్ ప్రాంతంలో 10 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50 శాతం వాటా, రాయల్ ఓక్ ఫర్నిచర్ షాపుకు లీజుకు ఇచ్చిన 3,000 గజాల వాణిజ్య స్థలం కూడా ఆయన పేరిట ఉన్నట్లు తేలింది.
ఇవేకాకుండా, కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లో రూ.1.37 కోట్ల నగదు, అశోక్ టౌన్షిప్లో రెండు ఫ్లాట్లు, 4,000 గజాల స్థలంలో నిర్మించిన పాలీ హౌస్ కూడా గుర్తించినట్లు ఏసీబీ డీజీ చారుసింహా తెలిపారు.
కిషన్ నాయక్‌కు సంబంధించిన బంధువుల ఇళ్లలో లభ్యమైన ఆస్తి పత్రాలన్నింటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, ఆయన మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.250 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో మరింత లోతైన విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.




