
YSR Praja News Telugu : వైఎస్సార్ జిల్లా, పులివెందుల:
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో, వైద్యుల సూచన మేరకు నేటి పులివెందుల పర్యటనలో భాగంగా నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు.
ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ అధికారికంగా ట్విట్టర్ (X) వేదికగా ప్రకటించింది. ప్రస్తుతం వైఎస్ జగన్ విశ్రాంతి తీసుకుంటున్నారని, ఆరోగ్యం మెరుగుపడే వరకు ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
నేటి షెడ్యూల్ ప్రకారం వైఎస్ జగన్ ఇడుపులపాయలో ప్రార్థనల్లో పాల్గొనాల్సి ఉండగా, అనంతరం పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాల్సి ఉంది. అయితే అనారోగ్య కారణాలతో ఈ కార్యక్రమాలు రద్దయ్యాయి. ఇక రేపు పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనాలన్న ప్రణాళికపై ఆరోగ్య పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, మంగళవారం పులివెందుల పర్యటనలో వైఎస్ జగన్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలతో సన్నిహితంగా మమేకమయ్యారు. పులివెందులకు చేరుకున్న ఆయనకు వైఎస్సార్సీపీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. క్యాంపు కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలను పేరుపేరున పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజల నుంచి వచ్చిన పలు సమస్యలను ఓపికగా విన్న వైఎస్ జగన్.. ‘నేనున్నాను, రాబోయే రోజులు మనవే’ అంటూ వారికి భరోసా ఇచ్చారు. సాయంత్రం 3.30 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల కష్టాలను వింటూ, సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. జగన్ రాకతో క్యాంపు కార్యాలయ ప్రాంగణం ‘జై జగన్’ నినాదాలతో మార్మోగింది.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్టీ నేతలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఒక భారంగా మారిందని, దాదాపు 1.30 లక్షల మంది టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. తమ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా మేలు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ఇప్పటి వరకు పీఆర్సీ చైర్మన్‌ను కూడా నియమించలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల సమస్యలను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.




