కృష్ణా జలాలపై ఏపీ ప్రయోజనాలను కాపాడాలి: చంద్రబాబుకు వైఎస్ జగన్ కీలక లేఖ

YSR Praja News : తాడేపల్లి: కృష్ణా నదీ జలాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను ప్రభుత్వం సమర్థంగా కాపాడాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఈ మేరకు ఆయన తొమ్మిది పేజీల లేఖ రాసి, జల వివాదాలపై ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం గట్టిగా వాదనలు వినిపించాలని, ముఖ్యంగా KWDT-2 (కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్) వద్ద జరుగనున్న విచారణల్లో రాష్ట్ర హక్కులను బలంగా ప్రస్తావించాలని జగన్ సూచించారు. ఈ విషయాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా ఆంధ్రప్రదేశ్ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

 

తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీల నీటిని కేటాయించే ప్రతిపాదనకు ట్రిబ్యునల్ అంగీకారం తెలిపితే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని జగన్ పేర్కొన్నారు. అందుకే రాష్ట్ర రైతుల ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వం తన వాదనలు వినిపించాల్సిన అవసరం ఉందన్నారు.

 

రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. ముఖ్యంగా ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశాన్ని ప్రస్తావిస్తూ, 1996లో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆ ఎత్తు పెంపు ప్రక్రియ ప్రారంభమైందని గుర్తుచేశారు. అప్పట్లో ప్రజలు, రైతులు తీవ్రంగా వ్యతిరేకించినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.

 

టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతి ఇచ్చిందని జగన్ ఆరోపించారు. అలాగే 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఏపీ హక్కులను తెలంగాణకు వదిలేసిందని పేర్కొన్నారు.

 

ప్రస్తుతం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని జగన్ స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ఇప్పటికే కేటాయించిన 512 టీఎంసీల నికర జలాల్లో ఒక్క టీఎంసీ కూడా తగ్గకుండా రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

 

ఏపీ హక్కుల్లో ఏ మాత్రం కోత పడినా దానికి చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వైఎస్ జగన్ తన లేఖలో స్పష్టంగా పే

ర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *