
గ్రామానికి చెందిన ఓ మహిళ తన 20 రోజుల చిన్నారిని ఒడిలో పెట్టుకుని ఇంటి బయట కూర్చుంది. ఆ సమయంలో అకస్మాత్తుగా కొన్ని కోతులు అక్కడికి వచ్చాయి. ఒక్కసారిగా మహిళపై దాడి చేసి, ఓ కోతి పసికందును లాక్కెళ్లింది. తల్లి భయంతో కేకలు వేయగా, చుట్టుపక్కల వారు కూడా అప్రమత్తమై కోతిని వెంబడించారు.
వెంటాడుతున్న జనాలను చూసిన కోతి సమీపంలో ఉన్న ఓ బావిలో చిన్నారిని విసిరేసి పారిపోయింది. తీవ్ర ఆందోళనకు గురైన గ్రామస్థులు వెంటనే బావి దగ్గరకు చేరుకుని చూడగా, చిన్నారి నీటిలో తేలుతూ కనిపించింది. ఎటువంటి ఆలస్యం చేయకుండా బావిలోకి దిగి పాపను బయటకు తీసి రక్షించారు.
ఈ ఘటనపై స్పందించిన స్థానిక నర్సు రాజేశ్వరి మాట్లాడుతూ, శిశువుకు వేసిన డైపర్ నీటిలో గాలితో నిండినట్లుగా తేలడంతో చిన్నారి మునగకుండా కాపాడబడిందని తెలిపారు. బయటకు తీసిన వెంటనే శిశువుకు అత్యవసర వైద్య చికిత్స అందించగా ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అయితే గ్రామంలో కోతులు సహా ఇతర అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు వాపోయారు. తరచూ ఇళ్లలోకి చొరబడి దాడులు చేస్తున్నప్పటికీ అధికారులకు ఫిర్యాదులు చేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అటవీ శాఖ తక్షణమే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.




