
YSR Praja News Telugu : వికారాబాద్: దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలకు నిరసనగా ఫిబ్రవరి 12, 2026న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ (CITU) నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లాలో సీఐటీయూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులను జిల్లా డీఎం అండ్ హెచ్‌వో కార్యాలయంలో ఏవో గారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐటీయూ వికారాబాద్ జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను తీవ్రంగా హరిస్తున్నాయని ఆరోపించారు. ఈ లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆశ వర్కర్స్‌కు కనీస వేతనం నెలకు రూ.26,000 ఇవ్వాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. అలాగే ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని, ఆశ వర్కర్స్‌తో పాటు స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల ప్రజలు, కార్మిక వర్గం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. 29 కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను అమల్లోకి తెస్తూ 2025 నవంబర్ 21న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ సవరణ చట్టం–2025ను ఉపసంహరించుకోవాలని, పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఎంజీఎన్రేగా చట్టాన్ని కొనసాగించాలని కోరారు.
నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వేతనాలు పెంచాలని, కార్మికులకు కనీస జీవన భద్రత కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కార్మిక హక్కులపై జరుగుతున్న నిరంతర దాడులకు వ్యతిరేకంగా ఈ దేశవ్యాప్త సమ్మెను నిర్వహిస్తున్నామని తెలిపారు.
కనీస వేతనాల అమలు, కాంట్రాక్టు మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయడం, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించడం, ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణను నిలిపివేయడం వంటి డిమాండ్లతో కార్మిక వర్గం ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో బలప్రయోగంతో కార్పొరేట్ అనుకూల చట్టాలు తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని దోపిడీ చేయడాన్ని సహించబోమని హెచ్చరించారు.
వికారాబాద్ జిల్లాలోని ఆశ వర్కర్స్ ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, అధికార యంత్రాంగం, యాజమాన్యాలు సహకరించాలని సీఐటీయూ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బుస్సా చంద్రయ్య, సీఐటీయూ తెలంగాణ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అమృత, జిల్లా కార్యదర్శి మంగమ్మ, జిల్లా నాయకురాలు ఉమా, పద్మ, సుజాత, యాదమ్మ, మీనా, పద్మ, బుడ్డమ్మ తదితర ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.




