ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి: తాండూరులో సిఐటియు గ్రామ సమన్వయ కమిటీల ఏర్పాటు

YSR Praja News Telugu : తాండూరు మండలంలోని వివిధ గ్రామాల్లో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ, ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి సిఐటియు పిలుపునిచ్చింది.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన సిఐటియు జిల్లా కార్యదర్శి కే. శ్రీనివాస్ మాట్లాడుతూ, కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలకు సిద్ధమైతేనే తమ హక్కులను కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాలోని అన్ని రంగాల కార్మికులు సమ్మెలో చురుకుగా పాల్గొని ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు గట్టి సమాధానం ఇవ్వాలని కోరారు.

మోడీ ప్రభుత్వం “శ్రమశక్తి నీతి–2025” పేరుతో కార్మిక విధానాన్ని ప్రకటించి, ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో లేబర్ కోడ్‌లను అమలు చేస్తోందని విమర్శించారు. ఈ విధానాలు కార్మికుల హక్కులను బలహీనపరుస్తున్నాయని, యూనియన్‌లతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.

కొత్త కార్మిక విధానాలను ప్రవేశపెట్టే ముందు కేంద్ర ప్రభుత్వం ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ నిర్వహించి కార్మిక సంఘాల అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉండేదని, కానీ అలాంటి ప్రక్రియ లేకుండానే చట్టాలను తీసుకురావడం దుర్మార్గమని విమర్శించారు. పార్లమెంట్లో సరైన చర్చ లేకుండానే కార్పొరేట్ ప్రయోజనాలకు అనుకూలంగా చట్టాలు సవరించారని ఆరోపించారు.

ఇప్పటి వరకు అమలులో ఉన్న “ఎనిమిది గంటల పని – ఎనిమిది గంటల విశ్రాంతి – ఎనిమిది గంటల వినోదం” అనే సూత్రాన్ని పక్కనపెట్టి, 12 గంటల పనిదినాలను అమలు చేయడం వల్ల కార్మికుల ఆరోగ్యం, కుటుంబ జీవితం దెబ్బతింటోందన్నారు. మూడు షిఫ్టుల విధానం తొలగి డే షిఫ్ట్, నైట్ షిఫ్ట్ విధానం రావడంతో కార్మికులు కుటుంబాలకు సమయం కేటాయించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.

కాంట్రాక్ట్ విధానం, వలస కార్మిక వ్యవస్థను ప్రోత్సహించడం వల్ల కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం వంటి హక్కులు దెబ్బతింటున్నాయని తెలిపారు. వేతన చెల్లింపుల భద్రత కూడా లేకుండా కార్మికులను అసురక్షిత స్థితిలోకి నెట్టుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక వర్గాన్ని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తాండూరు మండలం కన్వీనర్ జైపాల్, మల్కాపూర్ గ్రామ కన్వీనర్ వెంకట్ రాములు, కో కన్వీనర్ వసంత, మిట్టబసుపల్లి గ్రామ కన్వీనర్ అనిల్, కో కన్వీనర్ తుల్జమ్మ, గుంతబసుపల్లి కన్వీనర్ యాదమ్మ, మాణిక్యమ్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామపంచాయతీ కార్మికులు జిలాని, అంజిలప్ప, లక్ష్మి, వెంకటేష్, వెంకటమ్మ, రసూల్, పకిరప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *