మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. SIT దర్యాప్తులో షాకింగ్ విషయాలు

YSR Praja News Telugu : మొయినాబాద్/ సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తోంది. కేసును పూర్తిగా ఛేదించేందుకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసి కీలక వివరాలను సేకరిస్తోంది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అజీజ్‌నగర్‌లో ఉన్న తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో పాల్గొన్న నిందితులు మూడు రకాల డ్రగ్స్ వినియోగించినట్లు SIT అధికారులు గుర్తించారు.

మూడు రకాల డ్రగ్స్ వినియోగం

విచారణలో భాగంగా కొకైన్, ఎండీఎంఏ (MDMA), మెథోఇథిఫిన్ (Methamphetamine) వాడినట్లు అధికారులు నిర్ధారించారు. నిందితుడు కౌశిక్ రవి సిమ్లాలోని ఓ గుర్తుతెలియని వ్యక్తి వద్ద రూ.15 వేలకే కొకైన్ కొనుగోలు చేసినట్లు అరెస్టు సమయంలో వెల్లడించాడు.

అదేవిధంగా, ఎండీఎంఏ మరియు మెథోఇథిఫిన్ డ్రగ్స్‌ను సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అభిషేక్ నుంచి రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ హైదరాబాద్‌లోని అప్పా జంక్షన్ వద్ద కొనుగోలు చేసినట్లు SIT గుర్తించింది. అభిషేక్ గత కొన్నేళ్లుగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు, ఇప్పటికే అతనిపై ఒక కేసు నమోదై ఉన్నట్లు అధికారులు తెలిపారు.

పార్టీ వివరాలు బయటపడుతున్నాయి

విచారణలో భాగంగా రోహిత్ రెడ్డి రెండు రకాల డ్రగ్స్ వినియోగించినట్లు తెలిసింది. అధిక మత్తు కోసం ఖరీదైన మద్యంలో కొకైన్, మెథోఇథిఫిన్ కలిపి తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ వినియోగించినట్లు కూడా తేలింది.

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన నిందితులను SIT అధికారులు మళ్లీ విచారిస్తూ డ్రగ్స్ మూలాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పార్టీలో ఉపయోగించిన డ్రగ్స్ వివరాలు పూర్తిగా బయటపడుతున్నాయి.

కస్టడీపై కోర్టు తీర్పు రిజర్వ్

ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న రోహిత్ రెడ్డి, రితేరెడ్డి, నమిత్ శర్మలను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు వారిని ఏడు రోజుల కస్టడీకి ఇవ్వాలని రాజేంద్రనగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఈ నెల 20వ తేదీకి రిజర్వ్ చేసింది.

SITతో కమిషనర్ సమీక్ష సమావేశం

డ్రగ్స్ కేసు దర్యాప్తు పురోగతిపై ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుదీర్ బాబు, SIT అధికారులతో శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు.

వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు రంగాలకు చెందిన వ్యక్తులు ఈ డ్రగ్స్ పార్టీ నిర్వహించడానికి గల కారణాలను లోతుగా విచారించాలని కమిషనర్ సూచించినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *