​యంగ్ ఇండియా స్కూల్స్ వెనుక అతిపెద్ద స్కామ్? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు సంచలన ఆరోపణలు!

YSR Praja News Telugu : హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూటకోమారు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ పాలనను గాలికొదిలేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి టి. హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతకానితనానికి ఈ వరుస బదిలీలే నిదర్శనమని ఆయన విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై, ముఖ్యంగా అధికారుల బదిలీలు, టెండర్ల వ్యవహారంపై సంచలన ఆరోపణలు చేశారు.

బదిలీలతో గాడితప్పిన పాలన

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల వ్యవధిలో ఐదుసార్లు భారీ బదిలీలు జరిగాయని హరీశ్ రావు గుర్తుచేశారు. ఏకంగా 140 మంది ఐఏఎస్ అధికారులను, 20 జిల్లాల కలెక్టర్లను మార్చేశారని మండిపడ్డారు. రంగారెడ్డి లాంటి కీలక జిల్లాలో రెండేళ్లలో నలుగురు కలెక్టర్లు మారడం ప్రభుత్వ అస్థిరతకు అద్దం పడుతోందన్నారు.

జీహెచ్ఎంసీ (GHMC), సింగరేణి, పౌర సంబంధాలు, పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్ వంటి కీలక విభాగాల్లో నలుగురు చొప్పున విభాగాధిపతులను మార్చారని ఆయన ఆరోపించారు. అత్యంత కీలకమైన విద్యుత్ శాఖలో రెండేళ్లలో ఐదుగురు ప్రత్యేక కార్యదర్శులు మారారని, దీంతో ఆ శాఖ పూర్తిగా అవినీతిమయంగా మారిందని విమర్శించారు. సగటున ఎనిమిది నెలలు కూడా ఒక అధికారిని ఒకేచోట ఉంచకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మాట వినకపోతే బదిలీ వేటు!

తమకు వ్యక్తిగతంగా అనుకూలంగా పనిచేసే వారికే సీఎం, మంత్రులు కీలక పోస్టింగ్‌లు ఇస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల అక్రమాలకు, తప్పులకు సహకరించని నిజాయితీ గల అధికారులను వెంటనే బదిలీ చేస్తున్నారని విమర్శించారు. లగచర్ల ఆందోళనల సమయంలో ప్రభుత్వ హామీల ఎగవేతను ప్రశ్నించినందుకే వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్‌పై బదిలీ వేటు వేశారని ఆయన స్పష్టం చేశారు. కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపు ధోరణిలో మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయని ప్రభుత్వం.. కౌన్సిలర్ల విషయంలో మాత్రం ఎందుకు అంత వేగంగా స్పందిస్తోందని నిలదీశారు.

యంగ్ ఇండియా స్కూల్స్ టెండర్లలో గోల్ మాల్

రాష్ట్రంలో ఇంజనీరింగ్ విభాగాల్లో రిటైర్డ్ అధికారులకు పెద్దపీట వేస్తూ అవినీతికి తెరతీశారని హరీశ్ రావు ఆరోపించారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ల’ నిర్మాణ టెండర్లలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్నారు. తమకు అనుకూలమైన వారికి 5 శాతం అదనపు (ఎక్సెస్) రేటుకు టెండర్లు కట్టబెడుతున్నారని, ఈ కుంభకోణాన్ని త్వరలోనే ఆధారాలతో సహా బయటపెడతానని ఆయన హెచ్చరించారు.

నేడు నియోపోలిస్‌కు బీఆర్ఎస్ నిజనిర్ధారణ బృందం

హైదరాబాద్ శివారులోని నియోపోలిస్ ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి మేనల్లుడు యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా క్రషర్లు ఏర్పాటు చేసి కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి (లీజు, రాయల్టీ) గండి కొడుతున్నారని మండిపడ్డారు. ఈ అక్రమ మైనింగ్ వ్యవహారాన్ని స్వయంగా పరిశీలించేందుకు గురువారం (నేడు) బీఆర్ఎస్ ప్రతినిధి బృందం నియోపోలిస్‌లో పర్యటిస్తుందని ఆయన వెల్లడించారు.

కాగా, త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తమ పార్టీ అధిష్టానం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మీడియా అడిగిన ప్రశ్నకు హరీశ్ రావు బదులిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *